రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వరుసగా 9వ రోజూ యుక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు.
యుక్రెయిన్ కూడా ప్రతిఘటిస్తోంది. రష్యా బలగాలపై ఎదురు దాడి చేస్తోంది. కాగా, రష్యా-యుక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధం.. ఆ దేశాల్లో కొత్త చట్టాల అమలుకు దారితీసింది. రష్యా దాడులకు ప్రతీకార చర్యగా తమ దేశంలో ఉంటున్న రష్యన్ల ఆస్తులను సీజ్ చేసేందుకు గురువారం యుక్రెయిన్ కీలక చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రష్యా సైతం అలాంటి చట్టం ఒకటి తీసుకొచ్చింది.
సైన్యంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలకు ఉద్దేశించిన ఆ చట్టానికి శుక్రవారం నాడు రష్యా పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం రష్యా సాయుధ దళాలపై (Russia Military) తప్పుడు ప్రచారం వ్యాప్తి చేయడాన్ని జైలు శిక్ష విధించదగిన నేరంగా పరిగణిస్తారు. రష్యా సైన్యంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం వ్యాప్తి చేసిన వారికి 15 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. ఈ మేరకు రష్యా పార్లమెంటులోని దిగువ సభ ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది.