ఉలగ నాయగన్ కమల్ హాసన్ సుమారు నాలుగేళ్ల తర్వాత ‘విక్రమ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య విభిన్న పాత్రల్లో అలరించారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్ హాసన్ కెరీర్‌లోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇక ఇందులో కమల్ హాసన్ చేసిన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది.
జులై 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజైన ‘విక్రమ్’ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లో ‘బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్’ సాధించిందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న ‘ఓపెనింగ్ వ్యూస్’ రికార్డును ఈ మూవీ తిరగరాసిందని తెలిపారు. ఇంకా హైయెస్ట్ స్ట్రీమింగ్‌తో (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో) ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ విజయం పట్ల కమల్ హాసన్ కూడా స్పందించారు. ”డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా ‘విక్రమ్’ ప్రతీ ఇంటికి చేరడం ఆనందంగా ఉంది. ఇంతటి విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విక్రమ్ బృందానికి శుభాకాంక్షలు” అని తెలిపారు.
