TSRTC: రాఖీ పండుగ వేళ ఆడపడుచులకు మరో బంపర్ ఆఫర్.. వారం ముందు నుంచే..!

తెలంగాణలోని మహిళామణులందరికీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న టీజీఎస్‌ఆర్‌టీసీ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 19వ తేదీన రాఖీ పండుగ సందర్భంగా.. ఆడపడచులకు ప్రత్యేక ఆఫర్ ఇచ్చింది. ఆడపడుచుల కోసం ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. రక్షా బంధన్ సందర్భంగా.. ఆడపడుచులు తమ అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ఆనవాయితీ. అయితే కొందరు పుట్టింటికి, అన్నదమ్ములకు చాలా దూరంలో ఉండటమో.. అనివార్య పరిస్థితుల వల్ల వెళ్లలేకపోవటమో జరుగుతుంటాయి.

అలాంటి సందర్భాల్లో.. ఆ అక్కాచెల్లెల్లు.. పోస్ట్ లేదా కొరియర్ ద్వారా తమ అన్నదమ్ములకు రాఖీలు పంపి.. తమ అనుబంధాన్ని తెలియజేస్తుంటారు. అయితే.. ఇందుకోసం వాళ్లు కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అయితే.. ప్రయాణికుల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని.. వాళ్ల సౌకర్యాల దృష్ట్యా టీజీఎస్ ఆర్టీసీ కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే.. టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ అధికారులు రాఖీలను డెలివరీ చేయడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాఖీ పండుగకు నాలుగైదు రోజుల ముందే ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అధికారులు భావిస్తున్నారు.

కేవలం రాఖీలే కాదు.. వాటితో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు, ఇతర సామగ్రిని కూడా రవాణా చేయనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను డెలివరీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా కార్గో సర్వీసులు నిర్వహిస్తున్న అన్ని డిపోల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. రాఖీలు బుక్ చేసుకున్న 24 గంటల్లోనే గమ్యస్థానానికి చేరవేసేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే రాఖీల రవాణా ధర అనేది ఇప్పటికింకా ఖరారు చేయకపోవటం గమనార్హం. సోమవారం (ఆగస్టు 12వ తేదీ) నాటికి రాఖీల రవాణా ధరపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఈ సౌకర్యం.. ఆడపడుచులకు మంచి అవకాశం కావటంతో.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *