బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా 26 ఏళ్ల నహిద్ ఇస్లామ్.. రేసులో భారత వ్యతిరేకి కూడా!

Nahid Islam: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. దశాబ్దాలుగా ఆ దేశాన్ని ఏలిన షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక ప్రస్తుతం సైనిక పాలనలో ఉన్న బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటులో ముగ్గురి పేర్లు బాగా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ రిజర్వేషన్ల ఉద్యమానికి నాయకత్వం వహించిన 26 ఏళ్ల నహీద్ ఇస్లామ్ కొత్త ప్రధాని రేసులో ఉన్నారు. నహీద్ ఇస్లామ్‌తోపాటు మాజీ ప్రధానమంత్రి, షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా, నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ కూడా బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొన్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం పరిపాలనను ఆర్మీ నియంత్రణలోకి తీసుకుంది. ఆందోళన చేస్తున్న వారిని శాంతిపజేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ సలహాలతో బంగ్లాదేశ్‌లో మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల నేతలు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలోనే దేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో పాటు రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాల సభ్యులు.. మహ్మద్ యూనస్ నివాసంలో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ సోమవారం ఆలస్యంగా అంగీకారం తెలిపారు.

నహీద్‌ ఇస్లామ్(Nahid Islam)

విద్యార్థి నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త అయిన 26 ఏళ్ల నహీద్‌ ఇస్లా్మ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రేసులో ఉన్నాడు. ఢాకా యూనివర్సిటీలో సోషియాలజీ చదువుతున్న నహీద్ ఇస్లామ్.. ఇటీవల జరుగుతున్న ఆందోళనలకు నేతృత్వం వహించాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజ‌ర్వేష‌న్ చ‌ట్టానికి వ్యతిరేకంగా నహీద్ ఇస్లామ్ తీవ్ర పోరాటం చేశాడు. ఈ రిజర్వేషన్ల కోటా విధానంలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ విద్యార్ధుల ఉద్యమానికి జాతీయ సమన్వయకర్తగా పనిచేశాడు. చివ‌రికి షేక్ హ‌సీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఆందోళనల వేళ నహీద్ ఇస్లామ్ రెండుసార్లు కిడ్నాప్ అయ్యాడు. మొదట జూలై 19వ తేదీన న‌హీద్ ఇస్లామ్‌ను సుమారు 25 మంది ఇంటి నుంచి ఎత్తుకెళ్లి.. కళ్లకు గంత‌లు కట్టి, చేతుల‌కు బేడీలు వేసి తీవ్రంగా వేధించారు. 2 రోజుల త‌ర్వాత పూర్బాచ‌ల్ వ‌ద్ద ఉన్న ఓ బ్రిడ్జ్ కింద అప‌స్మార‌క స్థితిలో నహీద్ కనిపించడంతో.. ఆస్పత్రికి తరలించగా.. అక్కడ జూలై 26వ తేదీ మ‌రోసారి కిడ్నాప్‌కు గురయ్యాడు.

ఖలీదా జియా(Khaleda Zia)

షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయిన తర్వాత ఆమె రాజకీయ ప్రత్యర్థి, మాజీ ప్రధాని ఖలీదా జియా.. జైలు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఆమె వయసు 78 ఏళ్లు. ఖలీదా జియాను విడుదల చేసేందుకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలపై 2018 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలీదా జియా బయటికి వచ్చారు. ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ – బీఎన్‌పీ ప్రస్తుతం దేశంలో ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉంది. ఇక బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఖలీదా జియా పనిచేశారు.

1991 నుంచి 1996 వరకు.. 2001 నుంచి 2006 వరకు రెండు సార్లు ఖలీదా జియా.. బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఖలీదా జియా 1996 లో రెండోసారి ప్రధానమంత్రిగా గెలిచినప్పటికీ షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌తో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను బహిష్కరించి ఖండించాయి. దీంతో ఖలీదా జియా రెండోసారి ప్రధానిగా 12 రోజులు మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి… అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా గెలుపొందారు. అయితే షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో 2007లో అవినీతి ఆరోపణలపై ఖలీదా జియా అరెస్ట్ అయ్యారు. ఇదే కేసులో ఆమె 2018లో దోషిగా తేలడంతో జైలు శిక్ష విధించారు.

మహమ్మద్‌ యూనస్(Muhammad Yunus)

1983లో బంగ్లాదేశ్‌లో మహమ్మద్‌ యూనస్ గ్రామీణ బ్యాంకును స్థాపించాడు. గ్రామాల్లో ఉన్న మహిళలు.. చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి బ్యాంక్ చిన్న మొత్తంలో లోన్లను అందిస్తుంది. ఈ నిర్ణయం లక్షలాది మంది మహిళలను పేదరికం నుంచి బయటపడేస్తోంది. అందుకే మహమ్మద్ యూనస్‌కు పేదలకు బ్యాంకర్ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఇదే విధానం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాల్లో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌లో గ్రామీణ బ్యాంక్‌ను స్థాపించినందుకు 2006లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వరించింది.

అయితే మహ్మద్ యూనస్‌పై అవినీతి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ ఏడాది జూన్‌లో యూనస్‌కు చెందిన గ్రామీణ టెలికాం సంబంధించిన కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ. 219.4 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే రాజకీయ కక్షతోనే తనపై అవినీతి ఆరోపణలు చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఈ జనవరిలో కార్మిక చట్టాన్ని ఉల్లంఘించినందుకు 6 నెలల జైలు శిక్ష తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. షేక్ హసీనా రాజీనామా తర్వాత యూనస్‌ను ప్రధానిగా చూడాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. ఆర్మీ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం విద్యార్థులు అంగీకరించడం లేదు.

About rednews

Check Also

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *