జమ్మూ కశ్మీర్‌‌ అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు.. మొదలై తొలి విడత పోలింగ్

జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీకి పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 స్థానాలుండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో 24 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొదటి విడతలో వివిధ పార్టీలకు చెందిన 219 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతం కావడంతో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. 24 నియోజకవర్గాలూ పోలీసులు, సైన్యం అధీనంలోకి వెళ్లిపోయాయి.

మొదటి దశలో మరాజ్‌ రీజియన్‌లోని అనంత్‌నాగ్, పుల్వామా, కుల్గాం, షోపియాన్‌ జిల్లాలు, చీనాబ్‌ లోయలోని దోడా, కిష్టావర్, రాంబన్‌ జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. . స్థానిక బలాలు, చారిత్రక నేపథ్యం, పార్టీల అనుబంధం ఈ ప్రాంతాల్లో పోలింగ్‌ను ప్రభావితం చేస్తాయి. పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పుర, జైనాపుర, షోపియాన్, డీహెచ్‌ పుర, కుల్గాం, దేవ్‌సర్, దూరు, కోకెర్‌నాగ్, అనంత్‌నాగ్‌ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా వంటి కీలక నియోజకవర్గాలు ఈ దశలో ఉన్నాయి. ప్రధాన పోటీ బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) -కాంగ్రెస్ కూటమి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) మద్య ఉంది.

ఇక, 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుచేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడంతో బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆర్టికల్ 370 తర్వాత రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. దీంతో జమ్మూ కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా సహా బీజేపీ నేతలతో పాటు కాంగ్రెస్-ఎన్సీ కూటమి రాష్ట్ర హోదాను పునరుద్దరిస్తామని హామీ ఇచ్చాయి.

గులాం నబీ ఆజాద్‌కు చెందిన డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ, అబ్దుల్ ఘనీ లోనేకు చెందిన పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ, అల్తాఫ్ బుఖారీ అప్నీ పార్టీలు కూడా కీలకం కానున్నాయి. అంతేకాదు, నిషేధి జమతే ఇస్లామ్ సంస్థ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం గమనార్హం. ఈసారి బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. నియోజకవర్గాల పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు అంశంకు తమకు కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. పునర్విభజన వల్ల బీజేపీకి పట్టున్న జమ్మూ ప్రాంతంలో నియోజకవర్గాలు పెరగడం ఆ పార్టీకి సానుకూలంశం. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ దూరంగా ఉంది.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *