బాల్టిమోర్ బ్రిడ్జ్ విధ్వంసం.. నౌక యజమాన్యంపై రూ.837 కోట్ల దావా

‘బాల్టిమోర్‌లో వంతెనకు వాటిల్లిన నష్టం, నౌకాశ్రయంలో సేవల పునరుద్ధరణ కోసం వెచ్చించిన మొత్తాన్ని ఈ ఘటనకు కారణమైన సంస్థల నుంచి పొందేలా అమెరికా న్యాయశాఖ పని చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ దావా వేశాం.. ఈ ఘటనకు కారకుల్ని బాధ్యుల్ని చేసేందుకు కట్టుబడి ఉన్నాం. సదరు సంస్థల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణం’ అని అమెరికా అటార్నీ జనరల్ మెర్రిక్ గార్లాండ్ ఓ ప్రకటనలో తెలిపారు.

వంతెనను ఢీకొట్టిన నౌకలోని విద్యుత్, మెకానికల్ వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేవని దావాలో పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్‌పై సపోర్ట్ కాలమ్‌ను కొట్టే ముందు నౌకలో విద్యుత్ సరఫరా ఆగిపోయిందని ఆరోపించారు. ఇది కేవలం యాజమాన్యం తప్పిదమేనని; నౌక నిర్వహణ సక్రమంగా ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. సింగపూర్‌కు చెందిన నౌక యాజమాన్యం గ్రేస్ ఓషన్ ప్రైవేట్‌, సినర్జీ మెరైన్ ప్రైవేట్‌ సంస్థలపై ఈ దావా వేసింది. అయితే, దీనిపై స్పందించిన ఆ సంస్థలు నష్ట పరిహారం తగ్గించాలని అభ్యర్థిస్తున్నాయి. ఈ మొత్తాన్ని 44 మిలియన్ల డాలర్లకు కుదించాలని కోరుతున్నాయి.

నౌక ఢీకొనడంతో పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన మొత్తం కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం.. మార్చి 25న అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఆ సమయంలో నౌకలో ఉన్న భారత సిబ్బంది.. అధికారులను అప్రమత్తం చేయడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందడంతో వంతెనపై రాకపోకలను నిలిపేశారు. ఈ ఘటనను మేరీల్యాండ్ గవర్నర్ ‘జాతీయ ఆర్థిక విపత్తు’గా అభివర్ణించారు. అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో ఒకటైన బాల్టిమోర్‌లో నెలల తరబడి కార్యకలాపాలు నిలిచిపోయాయి.

ఘటన తర్వాత బ్రిడ్జి శకలాలను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. వెయ్యి టన్నుల బరువులను ఎత్తగల భారీ క్రేన్‌ సాయంతో శిథిలాలను తొలగించడానికి పది రోజులు పట్టింది. వంతెనను ఢీకొట్టిన నౌకపైన 3 నుంచి 4 వేల టన్నుల బరువైన శకలాలు పడటంతో అది అక్కడే చిక్కుకుపోయింది. దాదాపు ఈఫిల్‌ టవర్‌ అంత పొడవైన ఆ భారీ నౌకను అక్కడ నుంచి తరలించడానికి నానా తంటాలు పడ్డారు.

About rednews

Check Also

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. రాండాల్ఫ్‌ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా.. ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *