అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ధోనీ.. మహీ కోసం IPL రూల్స్‌నే మార్చేశారుగా..!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో మరే ఆటగాడికి దక్కని క్రేజ్‌ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంతం. ఈ విషయం అందరికీ తెలిసిందే. పదకొండుసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే.. అది కెప్టెన్ కూల్‌ మాత్రమే. అందుకే అటువంటి ఆడగాడిని ఏ జట్టు అయినా ఎందుకు వదులుకుంటుంది చెప్పండి. చెన్నై సూపర్ కింగ్స్‌ కూడా అదే చేయాలని చూస్తోంది. ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐపీఎల్ పాలకమండలి.. ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్టంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రైట్‌ టు మ్యాచ్ కార్డు కూడా అందులోనే భాగంగా ఉంది. అయితే ఐపీఎల్ ప్రకటించిన తాజా రూల్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ పాలిట వరంగా మారాయి.

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదుసార్లు టైటిల్‌ అందించిన ధోనీ.. ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి ముందు కెప్టెన్సీని వదులుకున్నాడు. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. దీంతో ఆ సీజన్‌లోనే అతడు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతాడని అంతా భావించారు. కానీ గత సీజన్‌లో ధాటిగా బ్యాటింగ్ చేసిన ధోనీ.. వింటేజ్‌ మహీని గుర్తుకుతెచ్చాడు. దీంతో అతడు మరో సీజన్ ఆడతాడనే అంచనాలు నెలకొన్నాయి. వీటికి ఊతం ఇచ్చేలా.. ఐపీఎల్ రూల్స్ కూడా ఉన్నాయి.

43 ఏళ్ల ధోనీ.. టాప్‌ రిటెన్షన్‌ ఆటగాడిగా జట్టులో ఉండాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే అతడికి బదులు మరో యువ ఆటగాడిని అట్టిపెట్టుకుంటే సీఎస్కే భవిష్యత్‌ మెరుగ్గా ఉంటుందని అతడు భావిస్తున్నాడు. కానీ ఐపీఎల్ కొత్త రూల్స్‌ ధోనీ తన ప్రణాళికలను మార్చుకునేలా ఉన్నాయి. ఎందుకంటే ధోనీ ఈసారి కెప్టెన్ ‘అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్‌’గా ఆడే అవ‌కాశం ఉంది. ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ తీసుకొచ్చిన నిబంధ‌న‌ల ప్రకారం, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి ఐదేళ్లు గడిచిన ప్లేయర్‌ను అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా భావించనున్నారు. దీంతో ఈసారి ధోనీని ఆ కోటాలోనే జట్టులో అట్టిపెట్టుకోవాలని సీఎస్కే భావిస్తోంది. ఇందుకు ధోనీ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

ధోనీ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఆడాల్సి వస్తే.. అతడికి దక్కే మొత్తంలో భారీగా కోత పడనుంది. ఐపీఎల్‌ 2024కు గానూ మహీ.. రూ.12 కోట్లు అందుకున్నాడు. అయితే అన్‌క్యాప్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగితే మాత్రం రూ.4 కోట్లు మాత్రం పొందాల్సి ఉంటుంది. అంటే గత సీజన్‌తో పోలిస్తే రూ.8 కోట్ల తక్కువ. తనకు దక్కే మొత్తం గురించి ధోనీ ఆలోచిస్తాడా అంటే దాదాపుగా ఆలోచించకపోవచ్చు. జట్టు అవసరాల దృష్ట్యా తాను బరిలో ఉండాలనుకంటే ధోనీ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగడం ఖాయం. లేదా గాయాలు తగ్గకపోతే మాత్రం ధోనీ రిటైర్మెంట్‌ చెప్పొచ్చు.

About rednews

Check Also

భారత్ 46 ఆలౌట్.. సొంత గడ్డపై అత్యల్ప స్కోరు.. కివీస్ పేసర్ల ధాటికి విలవిల్లాడిన బ్యాటర్లు..!

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కుప్పకూలింది. పేకమేడను తలపిస్తూ.. భారత బ్యాటర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *