సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. కార్పొరేట్ సెక్టార్‌లో ఐదంకెల జీతం.. హైఫై లైఫ్.. వారంలో రెండ్రోజులు హాలీడే, విదేశీ ట్రిప్పులు ఇలా చాలా సౌకర్యాలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఉంటాయి. దీంతో చాలా మంది యువత బీటెక్‌లు చదివి సాఫ్ట్‌వేర్ రంగం వైపు మెుగ్గుచూపుతారు. గత పదేళ్లుగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సాఫ్ట్‌వేర్ రంగంపై వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తున్నారు. అయితే ప్రస్తుతం సీన్ మారుతోంది. కోట్ల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలంటే.. సెక్యూరిటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగాల వైపు యువత మెుగ్గు చూపుతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో చదువులు పూర్తి చేసి సర్కారు కొలువుల్లో చేరుతున్నారు.
తాజాగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈఈలుగా నియమితులైన వారికి నియామక పత్రాలు ఇచ్చారు. వచ్చే నెల 2న ఆర్ అండ్ బీ, త్వరలోనే పంచాయతీరాజ్, మిషన్ భగీరథ డిపార్ట్‌మెంట్లలో ఎంపికైన వారికి కూడా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. అయితే కొత్తగా ఏఈఈలుగా ఎంపికైన వారిలో చాలా మంది బిట్స్ పిలానీ, ఐఐఐటీ, నిట్, ఐఐటీ, బాసర ఐఐఐటీ, జేఎన్టీయూ, ఉస్మానియా, ఇతర రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక వర్సిటీలు, కాలేజీల్లో ఇంజినీరింగ్, ఎంటెక్ పూర్తి చేసినవారు ఉన్నారు. టీజీపీఎస్సీ విడుదల చేసిన 1250 ఏఈఈ సెలక్షన్ లిస్ట్‌లో దాదాపు 261 మంది వాళ్లే ఉన్నారు.
కొందరు సాఫ్ట్‌వేర్ సెక్టార్‌లో లక్షల, కోట్ల ఆఫర్లను వదులుకొని ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. దీనికి ప్రధాన కారణం జాబ్ సెక్యూరిటీ అని చెబుతున్నారు కొత్తగా ఎంపికైన ఏఈఈలు. సాఫ్ట్ వేర్ జాబ్‌లో కోట్ల ప్యాకేజీ ఉన్నా.. తీవ్రమైన పని ఒత్తిడి కూడా ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఆర్థిక మాంద్యం, ఏఐ రెవల్యూషన్ వంటివి ఏర్పడితే ఉన్న జాబ్ పోతుందని.. అప్పుడు జీవితం పూర్తిగా డిస్టర్బ్ అవుతుందని అంటున్నారు. ప్రైవేటు సెక్టార్‌లో ప్రాజెక్టులు, టార్గెట్లు వంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయని.. ప్రభుత్వ ఉద్యోగం అయితే ఏ టెన్షన్ ఉండదని చెబుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే 61 ఏళ్ల వరకు ఉద్యోగ భద్రత ఉండటంతో పాటుగా.. హెచ్ఆర్ఏ, వెహికల్, ఈహెచ్ఎస్, డీఏతో పాటు ఎన్నో అలవెన్సులు ఉంటాయిని అంటున్నారు. అందుకే తాము ప్రభుత్వ ఉద్యోగంలో చేరేందుకు మొగ్గు చూపామని చెబుతున్నారు. ఈ ఉద్యోగాల ద్వారా ప్రజలకు నేరుగా సేవ చేసే అదృష్టం కూడా ఉంటుందని.. సెలక్ట్ అయిన ఏఈఈలు వెల్లడించారు. ఇలా యువత తమ ఆలోచనలు మార్చుకొని ప్రభుత్వ ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు.