లెబనాన్ భూభాగంలో ఉన్న హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలోకి ఇరాన్ ప్రవేశించడంతో పశ్చిమాసియా ఇప్పుడు భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి.. ఇజ్రాయెల్ భూభాగంపై వందలకొద్ది క్షిపణులతో ఇరాన్ భీకర దాడికి దిగింది. ఈ క్రమంలోనే ప్రతీకార దాడులు తప్పవని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ భూభాగంలో ఉన్న ఆ దేశ అణు స్థావరాలు, చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌ను.. ఇజ్రాయెల్ తాజాగా హెచ్చరించింది.
ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ భూభాగంపైకి ప్రయోగించింది. ఇరాన్ జరిపిన దాడుల్లో ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాడులకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన ఇజ్రాయెల్.. ఇరాన్ పాలన ప్రపంచ శాంతికి ముప్పు అని తెలిపింది. ఈ క్రమంలోనే ఇరాన్ భూభాగంలో ఉన్న అణు కేంద్రాలు లేదా చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.