Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మరో వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో దొంగతనం జరిగింది. అది కూడా ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఈ చోరీ జరింది. ఈ నెల 9న.. బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు ఎత్తుకుపోయారు. ఈ విషయంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ చోరీ చేసింది ఎవరో బయటవ్యక్తి కాదు.. ఇంటిదొంగే. అన్నదాత సత్రం ఇంఛార్జ్ అయిన జానియర్ అసిస్టెంట్ రాములు. సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించిన అధికారులు.. రాములే ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. దీంతో.. ఈ వ్యవహారంపై రాములుకు మెమో జారీ చేసి.. విచారణకు ఆదేశించారు. నివేదిక అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలియజేశారు.
ఇదిలా ఉంటే.. గతంలోనూ కొండగట్టుగా భారీ చోరీ జరిగింది. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఈ చోరీలో ప్రధానాలయంలోని రెండు విగ్రహాలను దుండగులు ఎత్తుకుపోయారు. రెండు విగ్రహాలతో పాటు వెండి, బంగారం వస్తువులు కూడా చోరీకి గురయ్యాయి. మొత్తంగా 15 కిలోల వెండితో పాటు కొన్ని బంగారు ఆభరణాలు కూడా దొంగిలించారు. వీటన్నింటి విలువ సుమారు 9 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. అయితే.. ఈ చోరీ కేసులో ప్రధాన నిందితునితో సహా మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు కర్ణాటకకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. ఆంజనేయ స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే అదిరిపోయే గుడ్ న్యూస్ వినిపించింది. కొండగట్టులో భక్తుల కోసం 100 గదులు నిర్మించేందుకు టీటీడీ గతంలోనే ముందుకురాగా.. ఈమధ్యే ఇంజనీర్లు వచ్చారు. గదుల నిర్మాణం కోసం అనువైన ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. ఆలయ అధికారులు చూపించిన స్థలాన్ని ఫైనల్ చేయగా.. అందులో త్వరలోనే భవనం నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు.