Jammu Kashmir: ఎట్టకేలకు జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడింది. ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం సాధించగా.. తాజాగా ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతోపాటు డిప్యూటీ సీఎం సహా నలుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరిలో ఏకైక మహిళా మంత్రిగా సకీనా ఈటూ ప్రమాణం చేశారు. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన సకీనా ఈటూ.. తండ్రి, సోదరుడు కూడా రాజకీయాల్లో ఉండేవారు. ఆమె తండ్రి, సోదరుడిని ఉగ్రవాదులు చంపేయగా.. సకీనా ఈటూ 20 సార్లు హత్యాయత్నాల నుంచి బయటపడ్డారు. గతంలోనూ మంత్రిగా పనిచేసిన సకీనా ఈటూ.. తాజాగా మరోసారి ఒమర్ అబ్దుల్లా కేబినెట్లో స్థానం దక్కించుకున్న ఏకైక మహిళగా నిలిచారు.
దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లా డీహెజ్ పోరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సకీనా ఈటూ ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. మెహబూబా ముఫ్తీకి చెందిన పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి గుల్జార్ అహ్మద్ దర్పై 17,449 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సకీనా ఈటూ.. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో పలు హోదాల్లో పనిచేశారు. సకీనా ఈటూ తండ్రి వలీ మోహమ్మద్ ఈటూ.. గతంలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. అయితే ఆయన 1994లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత సకీనా ఈటూ సోదరుడు రాజకీయాల్లోకి రాగా.. అతడ్ని 2001లో ఉగ్రవాదులు హత్య చేశారు.