ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా యువ అధికారి ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. కడప జిల్లా నుంచి ఏరికోరి ఆయన్ను తీసుకొచ్చి మానవ వనరులశాఖలో మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా నియమించారు. రమణ గతంలో తూర్పు గోదావరి జిల్లా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేశారు. అక్కడ గిరిజనులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో, జీవన ప్రమాణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అక్కడ నుంచి కడప జిల్లా బద్వేలు ఆర్డీవోగా బదిలీ కాగా.. అక్కడ కూడా సమర్థవంతమైన అధికారిగా ప్రశంసలు పొందారు. ఇప్పుడు నారా లోకేష్ ఓఎస్డీగా నియమితులయ్యారు.
ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఆకుల శ్రీరాములు, లక్ష్మీనరసమ్మల కుమారుడు వెంకట రమణ. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రమణ.. ప్రభుత్వ కొలువు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివారు.. విద్యాభ్యాసం మొత్తం మార్కాపురంలో జరిగింది. 2000లో ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక.. బీటెక్ చేయడం కోసం ఏడా3ది పాటూ సొంతంగా ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యారు. 2001లో వెయ్యి ర్యాంకు సాధించగా.. బీటెక్ (ఈసీఈ)లో చేరారు. నాలుగేళ్లు బీటెక్ తర్వాత క్యాంపస్ సెలక్షన్స్‌లో ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థలో 2005లో సర్క్యూట్ డిజైన్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించారు.
ఆయన ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే.. ఖాళీ సమయాల్లో తోటి ఉద్యోగులతో కలసి సమీప ప్రాంతాల్లోని స్కూళ్లకు వెళ్లి, అక్కడి విద్యార్థులకు క్లాసులు చెప్పేవాళ్లు. అలా అక్కడి లోటుపాట్లను చూసి ప్రభుత్వ సర్వీసుల ద్వారా మరింత సేవ చేయొచ్చని భావించారు. 2009లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. సివిల్స్, గ్రూప్స్ ప్రిపరేషన్‌వైపు మొగ్గు చూపారు. ఉద్యోగం చేయడం లేదు.. ఖర్చులకు డబ్బులు కావాలి.. ఇలాంటి సమయంలో వ్యక్తిగత ఖర్చుల కోసం కుటుంబంపై ఆధారపడటం ఇష్టం లేక గ్రూప్-2, బ్యాంక్ పీఓ వంటి పరీక్షలకు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్‌కు ఫ్యాకల్టీగా పనిచేశారు వెంకటరమణ.
ఏపీపీఎస్సీ గ్రూప్-1కు తొలిసారిగా 2011లో హాజరుకాగా.. అప్పుడే ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు అది రద్దు కాగా.. మళ్లీ 2012లో రీ-ఎగ్జామినేషన్ నిర్వహించి.. ఫలితాలు విడుదల చేశారు. అందులో వెంకటరమణ మార్కుల పరంగా గ్రూప్-1 టాపర్‌గా నిలిచాను. వెంకట రమణ పెద్ద మనసు చాటుకున్నారు.. అత్యంత వెనుకబడిన తన సొంత ఊరు మార్కాపురంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆయన తల్లి దండ్రుల పేరుతో సొంతంగా గ్రంథాలయాన్ని నడుపుతున్నారుు. తన గతంలో పడిన ఇబ్బందులు ఎవరూ పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు.
వెంకట రమణ ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వందలాది మంది ఉపయోగించుకుంటున్నారు. అలాగే మార్కాపురం వచ్చిన ప్రతిసారీ గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోటివేషనల్ క్లాసులు నిర్వహిస్తూ.. పేద విద్యార్థులెవరైనా ఉంటే వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రి నారా లోకేష్ ఓఎస్డీగా నియమితులయ్యారు.