జీవో 117పై నివేదిక ఇవ్వండి
విద్యార్థులకు స్పోర్ట్స్ రిపోర్టులు
ప్రతి విద్యార్థికీ ప్రత్యేకంగా ఐడీ
విద్యాశాఖలో సమూల మార్పులు
సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి: విద్యా శాఖలో సమూల మార్పులు జరగాలని, ఉత్తమ ఫలితాల సాధన లక్ష్యంగా పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖపై ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఫలితాలు కనిపించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబ్‌సలో మార్పులు చేయాలని సూచించారు. దీనికోసం విద్యారంగ నిపుణులు, మేధావులు, ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖపై సచివాలయంలో సీఎం మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
విద్య ప్రతి ఒక్కరి హక్కని, బడి ఈడు పిల్లలు బడి బయట ఉండటానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ బడులు పోటీపడాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు వంద శాతం మంది బడుల్లో ఉండాలని, గ్రాడ్యుయేషన్ వరకు పర్యవేక్షణ కొనసాగాలన్నారు. ప్రతి విద్యార్థికీ ఐడీ ఇవ్వాలన్నారు. కర్నూలు జిల్లాలో వలసల కారణంగా పిల్లలు బడులకు దూరమతున్నారని అధికారులు వివరించగా, వారిని గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. డైట్ కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలన్నారు.
లోకేశ్ ప్రజెంటేషన్
విద్యాశాఖ స్థితిని మంత్రి లోకేశ్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో 44,750 ప్రభుత్వ, 813 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయన్నారు. పది మంది కంటే తక్కువ విద్యార్థులున్న బడులు 5,520, 20 మంది కంటే తక్కువ మంది ఉన్న బడులు 8,702 ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 70,22,060 మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 35,13,533 మంది, ఎయిడెడ్‌లో 92,579 మంది, ప్రైవేటులో 34,15,948 మంది ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1,87,996 మంది, ఎయిడెడ్‌లో 3,396 మంది టీచర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 2014-19 మధ్య విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చామని, 4,026 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం రద్దు చేసిన ఈ కార్యక్రమాన్ని తిరిగి అమలుచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
నైపుణ్య గణనపై..
నైపుణ్య గణనపై అధికారులు సీఎంకు వివరించారు. 1.6 కోట్ల కుటుంబాల్లో 3.54 కోట్ల మంది పనిచేసే వయసున్న ప్రజలున్నారని, వారి నైపుణ్యాలను గణన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ‘దీనికోసం 40 వేల మంది ఎన్యూమరేటర్లు కావాలి. 8 నెలల సమయం పడుతుంది. కేవలం సర్వేకే 70 రోజులు పడుతుంది. ఇంటింటికీ, మీసేవా కేంద్రాలు, విద్యా సంస్థలు, మొబైల్ యాప్ ఇలా నాలుగు విధానాల్లో గణన చేయొచ్చు’ అని తెలిపారు.
క్రీడలకు ప్రాధాన్యం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకుని, విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఇకపై విద్యార్థులకు విద్యా రిపోర్టులతో పాటు స్పోర్ట్స్ రిపోర్టులు కూడా అందించాలన్నారు. జీవో 117పై విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బడుల్లో పనిచేస్తున్న ఆయాలకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ఆదేశించారు. ఇంగ్లిష్‌తో పాటు మాతృభాష తెలుగుకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.