చంద్రబాబు హామీ.. 24 గంటల్లోనే డ్రైవర్‌కు ఆటో అందజేత.. ఆసక్తికర సన్నివేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడివాడలో ఆటో డ్రైవర్‌కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గురువారం గుడివాడ రామబ్రహ్మం పార్కులోని అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పునఃప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ రేమల్లి రజినీకాంత్‌తో మాట్లాడారు. ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్య చదివిస్తున్నానని ఆయన సీఎంకు వివరించారు. రజినీకాంత్ కుమారుడు రవితేజ తాను ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తన చెల్లి బీడీఎస్‌ చదువుకు చేదోడుగా నిలుస్తున్నానని చెప్పారు.

అయితే ఆడపిల్ల చదువు కష్టం కాకూడదని.. రజినీకాంత్‌కు ఎలక్ట్రిక్ ఆటో సమకూరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీ మేరకు గంటల వ్యవధిలో రూ.3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్‌ ఆటోను అందించారు. కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదేశాలతో ఆర్టీవో నిమ్మగడ్డ శ్రీనివాస్‌ గురువారం రాత్రి ‘అపే ఈసిటీ’ ఆటో తీసుకున్నారు. ఆ ఆటోను గుడివాడ మున్సిపల్‌ కమిషనర్‌ జి.బాలసుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రజినీకాంత్‌కు ఆటో తాళాలు అందజేశారు.

ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆటో పంపించడం ఆనందంగా ఉందంటున్నారు ఆటో డ్రైవర్ రజినీకాంత్. తన జీవితంలో చాలా మంది నేతలను చూశానని.. కానీ చంద్రబాబు వంటి నేతను ఇంత దగ్గరగా చూడలేదన్నారు. చంద్రబాబు రుణం తీర్చుకోలేమని.. ఆయన చేసిన మేలును తమ కుటుంబం ఎప్పుడూ మరచిపోదన్నారు. గంటల వ్యవధిలో ఎలక్ట్రిక్‌ ఆటో సమకూర్చడం నమ్మలేకపోతున్నాను అన్నారు.

గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్‌ రజినీకాంత్‌ను వేదికపైకి పిలిచారు. డీజిల్ ఖర్చులు పెరిగిపోతున్నాయని.. వచ్చే ఆదాయం మిగలడంలేదని, దానికి సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే డీజిల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా మారిస్తే ఇంధనం ఖర్చు తగ్గుతుందన్నారు చంద్రబాబు. తనకు ఇంజిన్ మార్చడంపై అంత అవగాహన లేదని.. ఒకవేళ కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలు చేయాలంటే రూ.3 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. ముందు రజినీకాంత్‌తోనే ఎలక్ట్రిక్ ఆటో విధానం ప్రారంభిస్తామన్నారు.. మాట ఇచ్చినట్లుగానే ఆటోను ఇచ్చారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *