అన్న క్యాంటీన్లకు ప్రతి ఏటా రూ.కోటి ఇస్తానన్న ప్రముఖ వ్యాపారి.. ఆయనకు రూ.100 కోట్లు ఆదాయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది. కృష్ణా జిల్లా గుడివాడలో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలో సంపద ఉన్నవారు అట్టడుగున ఉన్న వారికి సాయం చేసి సమానంగా తీసుకు రావాలని చంద్రబాబు సూచించారు. అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు విరాళాలు అందజేయాలని కోరారు.. వీరి కోసం ప్రత్యేకంగా అకౌంట్ నంబర్ ప్రారంభించారు. ఎస్‌బీఐ ఖాతా నంబరు 37818165097, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎస్‌బీఐఎన్‌0020541కు అందించాలన్నారు. వెబ్‌సైట్‌ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు.

అన్న క్యాంటీన్ల కోసం ప్రభుత్వానికి నేరుగా విరాళాలు అందించలేని వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా లేదా చెక్కులను అన్నక్యాంటీన్లకు సంబంధించిన ఖాతాలో జమచేయొచ్చు. ఈ ఖాతాకు వచ్చిన మొత్తం నగదును అన్న క్యాంటీన్ల నిర్వహణకు వినియోగిస్తారు. ఖాతా పేరు: అన్న క్యాంటీన్స్ (ANNA CANTEENS), ఖాతా నెంబర్: 37818165097, బ్రాంచి: చంద్రమౌళినగర్, గుంటూరు, ఐఎఫ్‌ఎస్‌సి కోడ్: SBIN0020541.

అన్న క్యాంటీన్లలో ఒక మనిషికి రోజుకు రూ.96 ఖర్చు అవుతుందని ప్రభుత్వం తెలిపింది. అన్న క్యాంటీన్లలో ఆహారం తినే వ్యక్తి రూ.15 చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం, దాతలు భరిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తామని చెప్పగానే ఎంతోమంది దాతలు ముందుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు మళ్లీ పెడతామంటే శ్రీనివాస్ రాజు అనే వ్యక్తి రూ.కోటి విరాళం అందజేశారన్నారు. తన భార్య నారా భువనేశ్వరి సైతం రూ.కోటి విరాళాన్ని అందించారన్నారు. రాబోయే రోజుల్లో మరింతమంది దాతలు ముందుకొచ్చి అన్న క్యాంటీన్లకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో ఎవరైనా ఇంట్లో పెళ్లి జరిగితే.. వివాహ ఖర్చు కొంత తగ్గించుకుని అన్న క్యాంటీన్లకు విరాళం అందించాలన్నారు.

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ తిరుమలలో ట్రస్టు ఏర్పాటు చేసి.. నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ప్రస్తుతం అక్కడ రోజుకు లక్ష మందికి భోజనం పెడుతున్నారని.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్‌ నిర్వహణకు ట్రస్టు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 100 క్యాంటీన్లు ప్రారంభించామని.. సెప్టెంబరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో క్యాంటీన్‌లో సగటున 350 మంది వరకు ఆహారం అందిస్తామని.. రోజుకు రూ.26,250 చొప్పున ఖర్చవుతుంది అన్నారు. ఏడాదికి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని.. హరేకృష్ణ ఛారిటబుల్‌ సంస్థ అక్షయపాత్రతో కలిసి రోజుకు 23 లక్షల మందికి ఆహారం అందిస్తున్నారన్నారు.

అన్నా క్యాంటీన్లకు స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాసరాజు ఏటా రూ.కోటి చొప్పున ఇస్తానని ప్రకటించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కృష్ణా జిల్లాకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కలిపి రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే టీడీపీ నేత దండమూడి చౌదరి అనే వ్యక్తి రూ.5,07,779 విరాళం అందజేశారు. ఏటా ఆగస్టులో ఈ మొత్తాన్ని ఐదేళ్లపాటు అందిస్తానని తెలిపారు.. అలాగే మరికొందరు విరాళాలు అందజేశారు. శ్రీనివాసరాజు గురించి చెబుతూ చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థిరాస్తి వ్యాపారి శ్రీనివాసరాజు భూములకు విలువ పెరిగిందన్నారు. ఆయనకు ఏకంగా రూ.100 కోట్ల వరకు ఆదాయం పెరిగిందన్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *