ఢిల్లీకి చంద్రబాబు.. హడావిడిగా వెళ్తున్న ఏపీ సీఎం, రేవంత్ కూడా హస్తినలోనే.. ఎందుకంటే!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల పాటూ ఆయన హస్తినలో ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ఢిల్లీకి వెళతారు.. 16, 17న అక్కడే ఉంటారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటూ పలువుర్ని కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి కేంద్ర సాయం, పెండింగ్‌ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించిన వివిధ అంశాల అమలుకు కార్యాచరణపై కేంద్ర పెద్దలతో చర్చిస్తారని తెలుస్తోంది.

చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటంతో 16న తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో అందుబాటులో ఉండరని ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. వాస్తవానికి చంద్రబాబు శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంది. కానీ షెడ్యూల్ మార్పు వల్ల శుక్రవారం వెళతారని ముందు ప్రకటించారు. అయితే శుక్రవారం కూడా బిజీ షెడ్యూల్, ఢిల్లీ పర్యటన కారణంగా వాయిదా వేశారు. చంద్రబాబు బదులు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వినతులు స్వీకరించనున్నారు.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. రేవంత్ గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి సమావేశంకానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు, నూతన పీసీసీ అధ్యక్షుడు ఎంపిక, కేబినెట్‌లో కొత్తవారికి చోటు కల్పించడం సహా ఇతర అంశాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరికొన్ని కీలకమైన భేటీలు జరగనున్నాయి.

రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్, సీఈవో యంగ్ లియూతో ఢిల్లీలోనే సమావేశం అవుతారు. ఫాక్స్ కాన్ ఛైర్మన్ యంగ్ లియూతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయశ్ రంజన్, ఇతర అధికారులు పాల్గొంటారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *