ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వచ్చే నెల (సెప్టెంబరు) నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీకి సిద్ధమవుతోంది.. ఈ మేరకు పంపిణీకి చర్యలు కూడా చేపట్టింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా కీలకమైన పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. రేషన్‌తో పాటుగా సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది.. రెండు నెలలుగా ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం చక్కెర పంపిణీ నిలిపివేసింది.
ఏపీ ప్రభుత్వం సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రేషన్‌పై నిత్యవసరాలను తగ్గిస్తూ చివరకు బియ్యానికే పరిమితం చేసిందని.. అలాగే కందిపప్పును ఏడాదిగా నిలిపివేసిందని విమర్శలు ఉన్నాయి. మూడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి సరకుల సరఫరాపై జిల్లాలవారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండీయూ వాహనదారులతో సర్వే కూడా చేపట్టింది. అయితే కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, డబ్బులకు అరకిలో చక్కెర ఇస్తారు. వచ్చేనెల నుంచి కొత్త ప్యాకింగ్‌తో పాటు నిల్వవున్న పాత ప్యాకింగ్‌లోని చక్కెర పంపిణీ చేయనున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీపైనా ఫోకస్ పెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు.. మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. అలాగే మిగిలిన కార్డుల జారీకి సిద్ధమవుతోంది.. ఈ మేరకు కసరత్తు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో రేషన్ పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా షాపుల సంఖ్య పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 29,796 షాపులకు అదనంగా మరో 4 వేలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎండీయూ వాహనాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
ఈ మేరకు రేషన్ షాపుల్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎక్కువమంది కార్డుదారులు ఉన్న ప్రాంతాల్లో రేషన్ షాపులు పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి.. అయితే సగటున ఒక్కో షాపు పరిధిలో 500 రేషన్ కార్డులు వస్తాయి. కొన్నిచోట్ల మాత్రం ఒక్కో షాపు పరిధిలో 1,000 నుంచి 1,200 వరకు కార్డులు ఉన్నాయి. ఇలా ఎక్కువ కార్డులు ఉన్నచోట అదనంగా షాపులు ఏర్పాటు చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక్కో షాపునకు 700, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 750 కార్డులు మించకుండా ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కల్ని బట్టి చూస్తే అదనంగా 4వేల రేషన్ షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఓ అంచనా వేస్తున్నారు.