ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ మహిళల స్వయం ఉపాధి కల్పనకు సిద్ధమైంది. ప్రభుత్వం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న యూనిట్ల విస్తరణకు రూ.50వేల రాయితీతో రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రుణాలు అందిస్తోంది. అయితే వీరు తీసుకున్న రుణంలో రాయితీ పోను మిగతా మొత్తంపై వడ్డీ కూడా ఉండదు. నవంబరు నుంచి లబ్ధిదారుల ఎంపిక మొదలుకానుంది. రాయితీ రుణాలకు మూడేళ్లలో రూ.500 కోట్లు ఖర్చు చేయనుండగా.. ఇందులో రాయితీ రూ.180 కోట్లు, మిగతా రూ.320 కోట్లు వడ్డీలేని రుణంగా అందిస్తారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే తొలివిడతగా రూ.8కోట్ల రాయితీని ప్రభుత్వం జమచేసింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు సెర్ప్ ద్వారా మహిళలకు బ్యాంకు లింకేజి రుణాలు, సున్నావడ్డీ రుణాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ విధానంలో రుణంపై ఎలాంటి రాయితీ విధానం లేదు. అయితే తొలిసారిగా డ్వాక్రా పరిధిలో రాయితీ రుణాలు ఇస్తున్నారు.. దీనికి ఎస్సీ కార్పొరేషన్‌కు కేంద్రం ఇచ్చే నిధుల్ని సెర్ప్ పరిధిలోని ఉన్నతి పథకానికి అనుసంధానం చేస్తున్నారు. రాయితీ రుణాల కోసం ఇప్పటివరకు అధికారులు బ్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.. అయితే దీనికి బ్యాంకర్లు మాత్రం ఆసక్తి చూపించలేదు. అయితే ప్రభుత్వం రాయితీ విడుదల చేసినా దానికి తగినట్టుగా బ్యాంకర్లతో రుణాలు ఇప్పించడం ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు ఇబ్బందిగా ఉండేది. కేంద్రం నిధుల్ని సెర్ప్‌కు అనుసంధానించి అక్కడి నుంచి రుణాలు మంజూరు చేయించేలా సిద్ధమవుతున్నారు.