ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు బంపరాఫర్ ప్రకటించింది. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్, శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో.. బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ బైర్డ్ సహకారంతో సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. యువకుల కోసం ఎయిర్ కండిషనర్, కూలర్, రిఫ్రిజిరేటర్ మెకానిజమ్‌పై ఉచిత వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ మేరకు విజయవాడలోని రాజీవ్‌నగర్‌లోని భారత వికాస్ పరిషత్ భవనంలో అతి త్వరలో ఈ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు.
పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన యువకులు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. అభ్యర్థుల వయసు 19 నుంచి 30 ఏళ్లు ఉండాలని.. శిక్షణ కాల వ్యవధి 37 రోజులని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. అలాగే శిక్షణ కాలంలో ఉచిత మధ్యాహ్న భోజనం సదుపాయం కూడా ఉంది. అలాగే వర్కింగ్ మెటీరియల్ ఉచితంగా అందజేస్తారు.. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి శిక్షణ అనంతరం సర్టిఫికెట్ ఇస్తారు.
శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఎల్జీ, బ్లూ స్టార్, డైకిన్, క్యారియర్ ఎయిర్‌కాన్ కంపెనీల్లో ప్లేస్మెంట్లకు అవకాశం ఉంటుందని తెలిపారు అధికారులు. ఇక్కడ 40 మందికి మాత్రమే శిక్షణకు అవకాశం ఉందని.. ఇటీవల వచ్చిన వరద ముంపు ప్రాంతాల్లో ఉంటున్న వారికి తొలి ప్రాధాన్యం ఉంటుంది అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలకు గణేష్-99512 84459, గంగాధర్-7893416244, తులసీరామ్-9032840287లో సంప్రదించాలని సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.