పోలీసులకు గుడ్ న్యూస్.. హోం మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసులకు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శుభవార్త చెప్పారు. పోలీసులకు వీక్ ఆఫ్‌లు, సరెండర్ లీవ్‌లకు నిధులపై అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి గంజాయి నివారణ, పోలీసుల సంక్షేమంపై అన్ని జిల్లాల ఎస్పీలతో హోంశాఖ మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పోలీసులకు వంగలపూడి అనిత గుడ్ న్యూస్ వినిపించారు. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలన చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులకు సరెండర్ లీవులు ఇవ్వలేదన్న హోం మంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో సరెండర్ లీవులకు నిధులిస్తామని ప్రకటించారు.

ఇక ఏపీలో ఎక్కడ ఏ నేరం జరిగినా దాని వెనుక గంజాయి ఉంటోందని, గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏజెన్సీలో గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని అన్నారు. గంజాయి నివారణకు ఏపీ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని., గంజాయి వివరాలు అందిస్తే వారికి బహుమతి ఇస్తామని వంగలపూడి అనిత ప్రకటించారు. అన్ని జిల్లాలో కూడా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు. విశాఖలోనూ గంజాయి కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇక సోషల్ మీడియా వేదికగా హోం మంత్రిగా ఉన్న తనపైనా, హోం శాఖపైనా బురద జల్లుతున్నారన్న అనిత.. అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

గత ఐదేళ్లలో ఏపీలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని హోం మంత్రి ఆరోపించారు. పోలీసుల వద్ద ఇన్వెస్టిగేషన్ టూల్స్ లేవని.. డ్రగ్స్ టెస్టులు చేసేందుకు పరికరాలు లేవని అన్నారు. ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రం నుంచి తుపాకులు తీసుకురావాల్సి వచ్చిందన్నారు. గత ఐదేళ్లలో అధునాతన పరికరాలు, వాహనాల నిర్వహణ కూడా సరిగా లేదని చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేస్తోందని.. పోలీసుల సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పారు. పోలీసు అంటే భయం కాదు, పోలీసు అంటే భద్రత అని భరోసా కల్పించేలా పనిచేస్తామన్నారు. మహిళల భద్రత, నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత చెప్పారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *