ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో పోలేరమ్మ కొలుపులు (తిరుణాళ్లు) నిర్వహించారు.. మంత్రి, టీడీపీ నేతలు ఈ వేడుకకు హాజరుకాగా.. అక్కడ ప్రదర్శనకు ఉంచిన ఎడ్లబండ్ల ముందు స్థానిక నేతలు, మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇంతలో ఒక్కసారిగా ఎద్దులు బెదిరి మంత్రిని తలతో ముందుకు నెట్టాయి. ఈ ఘటనలో మంత్రి స్వామి ముందుకు బోర్లా పడిపోగా.. ఆయన్ను ఎద్దు ముందుకాళ్లతో బలంగా తొక్కింది.
వెంటనే గన్‌మెన్‌లు, టీడీపీ నేతలు అప్రమత్తం అయ్యారు.. ఎడ్లను అడ్డుకొని మంత్రిని ప్రమాదం నుంచి తప్పించారు. ఈ ఘటన తర్వాత మంత్రి స్వామి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని నివాసానికి వెళ్లారు. అక్కడ స్వామికి వైద్యులు చికిత్స అందించారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. టీడీపీ సీనియర్ నేత దామచర్ల పూర్ణచందర్రావు మంత్రి నివాసానికి వెళ్లి పరామర్శించారు. పలువురు టీడీపీ నేతలు ఫోన్ ద్వారా ఘటన వివరాలను తెలుసుకొని పరామర్శించారు. తన ఆరోగ్యం నిలకడగా ఉందని.. నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి స్వామి.
తిరుణాళ్ల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన డీజీ శబ్ధాల కారణంగా ఎద్దులు బెదిరి మంత్రి మీదికి తీసుకొచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మంత్రి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన తర్వాత మంత్రి స్వామి పోలేవరమ్మ తల్లి పూజా కార్యక్రమంలో పాల్గొని.. అనంతరం పాలేటిపాడు నుంచి బయల్దేరి నాయుడుపాలెంనకు వెళ్లినట్లు తెలుస్తోంది.