ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల లాటరీలో చిత్ర విచిత్రాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రాజకీయ నేతలు, వారి అనుచరులకు భారీగా షాపులు దక్కాయి. అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసరావుకు ఏకంగా 5 షాపులు దక్కడం విశేషం. ఆయనకు ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బల్లో 5 మద్యం షాపులు దక్కాయి. మంత్రి నారాయణ.. మొన్నటి ఎన్నికల్లో తన విజయం కోసం పనిచేసిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల కోసం నెల్లూరు జిల్లాలో తన సొంత డబ్బులు రూ.2 కోట్లతో మద్యం షాపులకు 100 దరఖాస్తులు వేశారు.. వారికి మొత్తం మూడు షాపులు దక్కాయి. ఒక్కో షాపును ఐదుగురు చొప్పున మొత్తం 15 మంది నిర్వహించుకునేందుకు వీలుగా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆ లైసెన్సులు అప్పగించడం విశేషం.
మడకశిర నియోజకవర్గంలో నాలుగు షాపులు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ప్రధాన అనుచరులైన వెంకటసుబ్బారెడ్డి, వైజయంతిమాల దంపతులకు వచ్చాయి. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని నాలుగు మద్యం షాపులు ఓ ఛానల్ యాజమాన్య ప్రతినిధులకు వచ్చాయి. ఆ ఛానల్ రిపోర్టర్ లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుటుంబానికి చెందినవారికి 5 షాపులు దక్కినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 158 మద్యం షాపుల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందినవారికే ఎక్కువ షాపులు వచ్చాయి.
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న 20 షాపుల్లో 9 షాపులు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ సహా సానుభూతిపరులకే దక్కాయి.అనంతపురం జిల్లాలో టీడీపీకి చెందిన మహిళలు 14 షాపలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రిలోని 20 మద్యం షాపుల్లో పదికి పైగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులకే లాటరీలో వచ్చాయి. అనంతపురం అర్బన్‌లో 30 దుకాణాలుండగా.. 15 స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అనుచరులకు రావం విశేషం. ఇలా రాజకీయ నేతలు, వారి అనుచరులకు కూడా లాటరీలో షాపులు దక్కాయి. కొన్నిచోట్ల తక్కువ దరఖాస్తులు రావడంతో కొంతమంద రాజకీయ నేతలకు లాటరీలో లక్ తగిలింది.
అంతేకాదు దివంగత నంద్యాల మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె సన్నపురెడ్డి సుజలకు లక్ తగిలింది. ఆమె వివిధ జిల్లాల్లో మద్యం షాపుల్ని దక్కించుకున్నారు. కర్నూలులో ఒకటి, అన్నమయ్య జిల్లా ఆరు, అనంతపురం జిల్లాలో 4 సహా, పీలేరు నియోజకవర్గంలోనూ షాపులు రావడం విశేషం. మొత్తం మీద కొన్ని జిల్లాల్లో రాజకీయ నేతలకు కూడా మద్యం షాపులు దక్కాయి. కొందరు రాజకీయ నేతలకు మాత్రం మద్యం షాపుల లాటరీలో లక్ కలిసిరాలేదు.. దీంతో వారంత నిరుత్సాహపడ్డారు.