వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం గురించి ప్రశ్నించిన వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైఎస్ జగన్‌కు లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది వైఎస్ జగన్‌నేనని ఆరోపించారు. ప్రకాశం జిల్లా నేతలమంతా కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిశామన్న గొట్టిపాటి రవికుమార్.. వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేశారన్నారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి కుమ్మకై.. ఏపీ ప్రయోజనాలను వైఎస్ జగన్ దెబ్బతీశారని ఆరోపించారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయన్న గొట్టిపాటి రవికుమార్.. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి మూడేళ్లయినా పెట్టలేని పరిస్థితి ఉందన్నారు. వైసీపీ పాలనలో పులిచింతలలో గేటుతో పాటుగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని విమర్శించారు. వైసీపీని ప్రజలు తిరస్కరించారనే విషయమ మర్చిపోయి.. వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ కొన్నిరోజుల పాటు నోరు తెరవకపోవటం మంచిదన్న గొట్టిపాటి రవికుమార్.. లేకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధిచెప్తారన్నారు.
మరోవైపు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునారావాసంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. పునరావాసం గురించి ప్రభుత్వం ఆలోచించాలన్న వైఎస్ జగన్.. అయితే ప్రభుత్వం దీనిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లను వైసీపీ ప్రభుత్వం హయాంలో పూర్తిచేశామన్న వైఎస్ జగన్ .. నిర్వాసితులకు పునారావాసం మిగిలిందన్నారు. పునారావాసం కోసం 12 వందల కోట్ల రూపాయలు చెల్లిస్తే ఈ సీజన్‌లోనే.. ప్రాజెక్టులో నీటిని నిల్వచేయవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు చెల్లింపులు చేసి.. ఈ సీజన్‌లోనే నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ట్వీట్ మీద ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు.