Bank Stock: ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన బంధన్ బ్యాంక్ (Bandhan Bank) స్టాక్ ఇవాళ దూసుకెళ్తోంది. మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే లాభాల బాట పట్టిన ఈ బ్యాంక్ షేరు.. 10 శాతానికిపైగా పెరిగి ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ వార్త రాసే సమయానికి 10.86 శాతం లాభంతో రూ.208.08 వద్ద కొనసాగుతోంది. ఈ స్టాక్ ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ఇంట్రాడే హై స్థాయి రూ.209.50 ని తాకి కాస్త వెనక్కి తగ్గింది. బంధన్ బ్యాంక్ స్టాక్ ఇవాళ రాణించేందుకు ఓ ప్రధాన కారణం ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
బంధన బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పార్థ ప్రతిమ్ సేన్ గుప్తా నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. జూలై 9వ తేదీన చంద్ర శేఖర్ ఘోశ్ ఈ పదవుల నుంచి వైదొలిగారు. ఆ తర్వాత రతన్ కేశ్‌ను తాత్కాలిక ఎండీ, సీఈఓగా నియమించారు. అయితే, ఇప్పుడు పూర్తి స్థాయి బాధ్యతలను ప్రతిమ్ సేన్‌కు బ్యాంక్ అప్పగించింది. అక్టోబర్ 8వ తేదీనే ఆయన నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపినట్లు బ్యాంక్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ పదవుల్లో ఆయన మూడేళ్ల పాటు కొనసాగుతారని తెలిపింది. అంతకు ముందు ప్రతిమ్ సేన్ గుప్తా 2016-2018 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్‌కతా సర్కిలో చీఫ్ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత 2020లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎండీ, సీఈఓ పని చేశారు. 2022 డిసెంబర్ వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
ప్రతిమ్ సేన్ గుప్తా నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపినట్లు వార్తలు వెలువడిన క్రమంలో బంధన్ బ్యాంక్ షేరు రాణిస్తోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.263 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.169గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.33 వేల 380 కోట్లుగా ఉంది. క్రితం రోజు మార్కెట్ సెషన్‌లో ఈ స్టాక్ రూ.187 వద్ద ముగియగా.. ఇవాళ 10 శాతానికిపైగా పెరిగి ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తోంది.