రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం స్పందించాలని విజ్ఞప్తి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి.. ఎప్పుడూ తన సొంత పార్టీపైనే విమర్శలు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు చేస్తుండగా.. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ ఇరకాటంలో పెట్టే పనిలో పడ్డారు. రాహుల్ గాంధీ సిటిజన్‌షిప్ గురించి చెప్పాలని.. గత కొన్నేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని సంప్రదించారు. అయితే కేంద్రం నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసిగిపోయిన సుబ్రమణ్యస్వామి.. ఏకంగా ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. రాహుల్ గాంధీ సిటిజన్‌షిప్‌పై ఢిల్లీ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసిన సుబ్రమణ్యస్వామి.. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.

రాహుల్ గాంధీ పౌరసత్వం అంశాన్ని 2019 లోనే సుబ్రమణ్యస్వామి తెరపైకి తీసుకొచ్చారు. అయితే రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి వివరాలు అందించాలని కేంద్రాన్ని కోరగా.. అటు నుంచి సమాధానం రాలేదు. ఆ తర్వాత పలుమార్లు కూడా సుబ్రమణ్యస్వామి ఇదే అభ్యర్థన చేసినప్పటికీ.. నరేంద్ర మోదీ సర్కార్ స్పందించలేదు. దీంతో చివరికి ఢిల్లీ హైకోర్టులో రాహుల్ సిటిజన్ షిప్ హోదాపై సుబ్రమణ్యస్వామి పిటిషన్ వేశారు. రాహుల్ గాంధీ సిటిజన్ షిప్‌పై గతంలో అనేకసార్లు తాను కేంద్రాన్ని సంప్రదించానని.. అయితే తన ఫిర్యాదుపై స్టేటస్ రిపోర్టును అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని తన పిటిషన్‌లో సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

2019లోనే కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సిటిజన్ షిప్‌పై సుబ్రమణ్యస్వామి లేఖ రాశారు. తాను బ్రిటిష్ పౌరుడినని అంటూ బ్రిటన్ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సమర్పించిన పత్రాలు తెలియజేస్తున్నాయని.. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9, 1955 నాటి భారత పౌరసత్వ చట్టం ప్రకారం.. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం నిషేధించినట్లు సుబ్రమణ్యస్వామి వాదిస్తున్నారు. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉంటే.. భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు రాహుల్ గాంధీ పౌరసత్వం ఏంటని ఆయన కొన్నేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నారు.

2003 లో రిజిస్టర్ అయిన బ్రిటన్‌కు చెందిన కంపెనీ బ్యాకప్స్ లిమిటెడ్ వార్షిక రిటర్న్‌లో రాహుల్ గాంధీ.. బ్రిటీష్ పౌరుడు అని పేర్కొన్నారని సుబ్రమణ్యస్వామి ఆరోపిస్తున్నారు. ఇదే గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ పౌరసత్వంపై అనేక సందేహాలను కలిగిస్తుందని ఆయన పేర్కొంటున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడై ఉంటే.. ఆయనకు ఉన్న భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయంపై 2019 ఏప్రిల్‌లో రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు జారీ చేసిందని.. అయితే ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని సుబ్రమణ్యస్వామి తెలిపారు.

మరోవైపు.. ఇదే పౌరసత్వం విషయంలో రాహుల్ గాంధీని 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలన్న విజ్ఞప్తిని 2019 మే నెలలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక డాక్యుమెంట్‌లో రాహుల్ గాంధీని బ్రిటిష్ అని పేర్కొన్నంత మాత్రాన అది అతన్ని బ్రిటిష్ పౌరుడిగా మారుస్తుందా అని కోర్టు ప్రశ్నించింది. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చినప్పటికీ.. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని సుబ్రమణ్యస్వామి పట్టుపడుతున్నారు. అంతేకాకుండా తాను ఫిర్యాదు చేసినా గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేసిందని సుబ్రమణ్యస్వామి తన పిటిషన్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను తాజాగా చేసిన ఫిర్యాదుపై ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవాలని.. ఈ అంశంపై తుది ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని సుబ్రమణ్యస్వామి తన పిటిషన్‌లో కోరారు. అయితే వచ్చే వారం ఈ పిటిషన్.. కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *