మహిళలకు శుభవార్త.. ప్రతీ నెల అకౌంట్లలోకి రూ.2100, విద్యార్థినులకు స్కూటీలు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 7 గ్యారెంటీల పేరుతో ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేయగా.. తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను ప్రకటించింది. హర్యానా వాసులకు కాంగ్రెస్ 7 గ్యారెంటీలు ఇవ్వగా.. బీజేపీ 20 హామీల వర్షం కురిపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా.. సంకల్ప్ పత్ర పేరుతో 20 పాయింట్ల వాగ్దానాలను ప్రకటించారు. గత ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చినట్లు జేపీ నడ్డా వెల్లడించారు. హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ చాలా బాగా అభివృద్ధి చేసిందని.. ఢిల్లీ నుంచి రోహ్‌తక్ చేరుకునేందుకు కేవలం గంటన్నర సమయం మాత్రమే పడుతోందని.. ఇదే తమ అభివృద్ధికి కొలమానం అని పేర్కొన్నారు. గతం కంటే హర్యానాలో రైల్వే బడ్జెట్ 9 రెట్లు పెరిగిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు.

హర్యానా ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే.. మాజీ అగ్నివీరులకు శాశ్వతంగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక రైతులు పండించే 24 రకాల పంటలను కనీస మద్దతు ధరలతో కొనుగోలు చేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా.. లాడో లక్ష్మీ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.2100 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపింది. హర్‌ ఘర్ గృహణి యోజన కింద రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్లను అందించనున్నట్లు తెలిపింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా కళాశాల విద్యార్థినులకు అవల్‌ బాలికా యోజన కింద స్కూటీలను అందిస్తామని బీజేపీ ఎన్నికల హామీల్లో చేర్చింది.

హర్యానాలో 10 పారిశ్రామిక నగరాల నిర్మాణం చేపట్టడంతో పాటు నగరానికి 50 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇక 2 లక్షల మంది హర్యానా యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు.. నేషనల్‌ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద 5 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపింది. చిరయు ఆయుష్మాన్‌ యోజన కింద ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చింది. 70 ఏళ్లు పైబడినవారికి అదనంగా రూ.5 లక్షల కవరేజీ ఉంటుందని స్పష్టం చేసింది.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *