Bold Care: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. దీంతో మోసాలు సైతం పెరిగాయి. ఈ క్రమంలో తమ కార్డుల వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని ప్రభుత్వాలు, బ్యాంకులు, ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాయి. తమ కార్డు వివరాలు బహిర్గతమయితే వెంటనే బ్యాంకుకు ఫోన్ చేసి బ్లాక్ చేయిస్తుంటారు. కానీ, ఓ వ్యాపారవేత్త ఏకంగా తన క్రెడిట్ కార్డు వివరాలను ఆన్‌లైన్‌లోనే పెట్టేశాడు. తన కార్డును ఉపయోగించుకుని మీకు నచ్చింది కొనుక్కోండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌లో తన కార్డు వివరాలను పోస్ట్ చేస్తూ తమకు నచ్చింది కొనుక్కోవాలని సూచించాడు. ఇంకేముంది ఈ ఆఫర్ కోసం జనం ఎగబడ్డారు.
బోల్డ్ కేర్ (Bold Care) అనే స్టార్టప్ సంస్థ సహ వ్యవస్థాపకుడు రాహుల్ కృష్ణన్ ఈ మేరకు తన క్రెడిట్ కార్డు వివరాలను సోమవారం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. బ్యాంక్ కార్డు నంబర్, ఎక్స్‌పెయిరీ డేట్, సెక్యూరిటీ కోడ్ వివరాలు అందించారు. అయితే, ఒక షరతు పెట్టారు. తన కార్డు ద్వారా రూ.1000 వరకు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పారు. ట్రాన్సాక్షన్లు పూర్తి చేసేందుకు తనకు వచ్చే ఓటీపీలను షేర్ చేస్తానని ఆఫర్ ఇవ్వడంతో ముందుగా దీన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కార్డు వివరాలతో చాలా మంది కొనుగోళ్లు చేపట్టారు. వారందరికీ సదరు వ్యాపారవేత్త ఓటీపీలను సైతం ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది. 5 గంటల్లోనే 200లకుపైగా ఓటీపీలు షేర్ చేశారు రాహుల్ కృష్ణన్. ఆ కార్డు వివరాలతో అత్యధికంగా జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అమెజాన్ వాటిల్లో కొనుగోళ్లు చేశారు.
కానీ, కొన్ని గంటల్లోనే ఆ కార్డును బ్యాంక్ బ్లాంక్ చేసినట్లు సదరు వ్యాపారవేత్త మరో పోస్ట్ చేయడంతో నెటిజిన్లు నిరాశకు గురయ్యారు. ఓటీపీలను ఇతరులతో పంచుకోవడం అనేది ఆర్‌బీఐ రూల్స్‌కు విరుద్ధం. ఒక్కసారిగా ట్రాన్సాక్షన్లు పెరగడంతో బ్యాంక్ కార్డును బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ చాలా మంది కొనుగోళ్లకు ప్రయత్నించారటా. దీంతో తనకు ఓటీపీలు పంపించొద్దని మరో పోస్టులో రాహుల్ కృష్ణన్ తెలిపారు. ఈ పోస్టుకు ఏకంగా 23 లక్షల మందికిపైగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, చాలా మంది దీనిపై విమర్శలు చేశారు. ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీగా పేర్కొంటున్నారు.
బోల్డ్‌కేర్ స్టార్టప్ సంస్థను 2020లో తన స్నేహితులతో కలిసి ప్రారంభించారు రాహుల్ కృష్ణన్. ఇది పురుషుల లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఈ సంస్థకు కొద్ది కాలంలోనే మంచి ఆదరణ లభించింది. 2023లో ఫోర్బ్స్ విడుదల చేసిన అండర్ 30 ఆసియా రిటైల్ ఇ-కామర్స్ సంస్థల జాబితాలో రాహుల్ చోటుదక్కించుకున్నారు.