ఒక్క రోజు ఆగినా ప్రాణం దక్కేది.. కన్నీరు తెప్పిస్తున్న కెమికల్ ఇంజనీర్ హారిక కథ

మృత్యువు.. అది ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం కష్టం. కటిక పేదరికంలో మగ్గుతున్న వాడైనా.. ఐశ్వర్యంతో తులతూగుతున్న కోటీశ్వరుడైనా.. మరణం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే ఆ మృత్యు దేవతకు కూడా మనసంటూ ఉంటే.. దానికి సైతం కన్నీళ్లు తెప్పించే ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఆగిపోయిన ప్రతి గుండె వెనుక.. గాయపడిన ప్రతి మనిషి వెనుక కదిలిస్తే కన్నీళ్లు తెప్పించే కథలెన్నో. అలాంటిదే చల్లపల్లి హారిక కథ..

కాకినాడ పట్టణంలోని సౌజన్య నగర్‌కు చెందిన ఈశ్వరరావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె చల్లపల్లి హారిక. తండ్రి ఈశ్వరరావు తాపీ మేస్త్రీగా పనిచేస్తూనే కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే విధి చిన్నచూపు చూసి.. ఐదేళ్ల కిందటే ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఈశ్వరరావు ఐదేళ్ల కిందట చనిపోయాడు. తోడుగా ఉంటాడనుకునే అన్నయ్య చిన్నప్పుడే ఇల్లువదిలి వెళ్లిపోయాడు. దీంతో తల్లీ, నాన్నమ్మతో కలిసి ఉంటోంది హారిక. కష్టపడి చదవటంతో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఏడాది కిందటే అచ్యుతాపురంలోని ఎసెన్షియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. దీంతో తమ కష్టాలు ఇక తీరినట్టేనని ఆ కుటుంబం భావించింది. మగదిక్కు లేకపోయిన తమ కుటుంబానికి తమ కూతురే ఆధారంగా ఉంటుందని ఆ తల్లీ, నాన్నమ్మ సంబరపడ్డారు.

అయితే ఎసెన్షియా కంపెనీలో పనిచేస్తున్న హారిక.. ఇటీవలే కాకినాడ వచ్చారు. రాఖీపండుగ కావటంతో పాటు.. ఓ పోటీ పరీక్ష రాసేందుకు ఆదివారం కాకినాడ వచ్చారు. కుటుంబసభ్యులకు రాఖీలు కట్టి సంతోషంగా గడిపారు. మరో రోజు కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుదామనే ఉద్దేశంతో బుధవారం కూడా సెలవు పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే యాజమాన్యం అంగీకరించకపోవటంతో.. వేకువజామునే బస్సులో అచ్యుతాపురం చేరుకున్నారు. ఎసెన్షియా కంపెనీలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో హారిక కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహం కాకినాడకు చేరుకోగా.. కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఒక్క రోజు ఆగి ఉంటే తమ హారిక తమకు దక్కేందన్న వారి ఆక్రందన అక్కడి వారికి కన్నీరు తెప్పిస్తోంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *