చంద్రబాబు నిర్ణయంతో బొత్స సత్యనారాయణకు జాక్‌పాట్.. అనుకున్నదే అయ్యిందిగా!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠరేపిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ కూటమి నిర్ణయించింది. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో నిర్ణయం ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీతో పాటూ కూటమి నేతలు కూడా ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి అత్యంత హుందాగా వ్యవహరించారని నేతలు అభిప్రాయపడ్డారు. నేటితో ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగుస్తుండగా.. చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. 2021 డిసెంబర్‌లో ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరిగాయి.. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసిన వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్, వరుదు కళ్యాణిలు విజయం సాధించారు. వీరిద్దరిలో వంశీకృష్ణ యాదవ్ 2023 నవంబరులో వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పి వెంటనే జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వంశీ పార్టీ మారడంతో వైఎస్సార్‌సీపీ మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ ఫిరాయించారని.. ఎమ్మెల్సీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ ఫిర్యాదును పరిశీలించిన శాసన మండలి ఛైర్మన్ అనర్హుడిగా ప్రకటించారు. వంశీ ఇటీవల జరిగిన ఎన్నికల్లోవిశాఖపట్నం దక్షిణం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఈ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవి ఖాళీగా ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది.. ఈ మేరకు ఇటీవ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయతే ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ప్రకటించారు. అయితే టీడీపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి.

ఈ పరిణామాలతో వైఎస్సార్‌సీపీ ముందే జాగ్రత్త పడింది.. తమ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. అలాగే కొందర్ని బెంగళూరుకు తరలించి క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇటు టీడీపీ కూటమి కూడా అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడింది.. తెరపైకి కొన్ని పేర్లు కూడా వచ్చాయి. అయితే చివరి నిమిషంలో కూటమి వెనక్కు తగ్గింది.. హుందాగా వ్యవహరించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో గెలిచిన వారి పదవీ కాలం 2027 డిసెంబరు ఒకటి వరకు ఉంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *