ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు నిర్వహించనున్నారు.
అమరావతి: ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ (రియల్ టైమ్ గవర్నెన్స్) శాఖలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఐటీ పెట్టుబడులను ఏపీకి రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఈ సమీక్షలో చర్చ జరగనుంది. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై మాట్లాడనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన ఐటీ పరిశ్రమలను తిరిగి రప్పించేలా వారితో చర్చలకు కార్యాచరణ రూపొందించనున్నారు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీతో సమానంగా హార్డ్ వేర్ రంగం నుంచి కూడా పెట్టుబడులు వచ్చేలా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రియల్ టైమ్ గవర్నెస్ వ్యవస్థను ప్రజావసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అంశంపైనా నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
ఏపీలో అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి వెళ్లిపోయిన సంస్థలన్నింటినీ తిరిగి రప్పించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. ఒకవైపు పలు శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. అంతేకాకుండా వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేశారు. అలాగే అనేక శాఖల్లో పరిస్థితి ఎలా ఉందనేదానిపై సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాజాగా విద్యా శాఖ, స్కిల్ డెవలెప్మెంట్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. అలాగే టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీపై రివ్యూ చేపట్టారు. అన్ని రంగాలపై దృష్టి సారిస్తూ ఏపీలో ఆర్థిక వనరులను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.
కీలక ఆదేశాలు..
నూతన పారిశ్రామిక విధానంపై తాజాగా నిర్వహించిన సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పారిశ్రామికాభివృద్ధికి సంబంధించి దేశంలోని టాప్-5 రాష్ట్రాలతో పోటీపడే స్థాయిలో ఏపీ నూతన పారిశ్రామిక విధానం ఉండాలన్నారు. ఈ దిశగానే చంద్రబాబు దూసుకెళ్లడంతో పాటు ఎప్పటికప్పుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనలో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు తెలిపారు. వృద్ధి రేటు15 శాతానికిపైగా సాధనే లక్ష్యంగా నూతన పాలసీ ఉండేలా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024-29పై ముసాయిదాను రూపొందించిన విషయం తెలిసిందే. దీనిని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అధికారులకు ఈ నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించారు.