Traffic Violations: రోడ్లపై ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తున్నా కొందరు వాహనదారులు మాత్రం దారికి రావడం లేదు. పదే పదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ వేల రూపాయల ఫైన్లు బండిపై ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి.. వాహనదారుల నుంచి ట్రాఫిక్ చలాన్ల సొమ్ము వసూలు చేస్తున్నాయి. తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన పంపించారు. ట్రాఫిక్ చలాన్లు అధికంగా ఉన్న వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఎక్కువగా వసూలు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు.
రోడ్లపై అతి వేగం, నిర్లక్ష్యంగా నడపడంతోపాటు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారు.. వాహనాల ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో అధిక ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని వీకే సక్సేనా పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వాహనదారుల సంఖ్యను తగ్గించేందుకు గాను కీలక చర్యలు తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ఇందుకోసం వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలాన్ల సంఖ్య ఆధారంగా వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని అనుసంధించి.. ఎక్కువ చలాన్లు ఉన్న వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని ఎక్కువగా వసూలు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను చేసిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వీకే సక్సేనా విజ్ఞప్తి చేశారు.