హైదరాబాద్‌లో పంజా విసురుతున్న డెంగీ.. 

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో అయితే డెంగీ పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నల్లకుంట ఫీవర్‌ హాస్పిటల్, నిలోఫర్‌లోని చిన్న పిల్లల విభాగానికి డెంగీ జ్వరంతో వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితం మూసాపేటలో ఓ 10 ఏళ్ల ఓ చిన్నారి డెంగీతో ప్రాణాలు కోల్పోయింది. సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. అలా నిర్లక్ష్యం చేస్తే ఐదారు రోజులకే పరిస్థితి సీరియస్‌గా మారి ఐసీయూలో చేరాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

గాంధీ హాస్పిటల్‌లో ప్రస్తుతం ప్రతి రోజు ఐదారుగురు చిన్నారులు డెంగీ జ్వరంతో చేరుతున్నారు. రోజూ 12-15 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. ముగ్గురు పిల్లలు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో 3 నెలల పసికందు నుంచి 10 ఏళ్ల చిన్నారుల వరకు ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.ఓ పసికందు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా 650పైగా కేసులు దాటాయని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ లెక్క ఇంకా ఎక్కువేగానే ఉండొచ్చునని తెలుస్తోంది. ప్రైవేటు హాస్పిటల్‌లో నమోదవుతున్న కేసులపై సరైన సమాచారం లేదు. దీంతో డెంగీ జ్వరం బారిన పడిన వారి సంఖ్య కచ్చితంగా తేలటం లేదు.

లక్షణాలు ఇవే..
డెంగీ సోకిన వారికి ఆకస్మికంగా జ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, కళ్ళు వెనుక భాగంలో నొప్పి, తీవ్రమైన కండరాల నొప్పి, వికారం, శరీరం అలసటగా అనిపించటం, అతిసారం, వాంతులు అవుతాయి. చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇది జ్వరం ప్రారంభమైన రెండు నుండి ఐదు రోజుల తర్వాత కనిపిస్తుంది. తేలికపాటి రక్తస్రావం (ముక్కు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం) కూడా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి

  • డెంగీ దోమ కాటు వల్ల వస్తుంది. కాబట్టి ఇంటి లోపలకు దోమలు రాకుండా చూసుకోవాలి. దోమ తెరలను ఉపయోగించాలి.
  • బయట ఉన్నప్పుడు, పొడవాటి చేతుల చొక్కా, పొడవాటి ప్యాంటును ధరించండి. తలుపులు,కిటికీలు మూసి ఉంచాలి.
  • వారం రోజులైన జ్వరం తగ్గకపోవటం, ఒంటిపై దద్దుర్లు, కీళ్ల నొప్పులు, రక్తస్రావం, తలనొప్పి, కండరాలు కంటి వెనుక నొప్పి తదితర లక్షణాల్లో ఏవైనా రెండు,అంతకంటే ఎక్కువ కనిపించాయంటే డెంగీ జ్వరంగా అనుమానించాల్సిందే.
  • వెంటనే ఆసుపత్రికి వెళ్లి NS1 లేదంటే డెంగీ IGM టెస్టు చేయించుకోవాలి. టెస్టుల్లో పాజిటివ్‌ వస్తే కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌(CBP) చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వార శరీరంలో ప్లేట్‌లెట్లు సంఖ్య తెలుస్తుంది.
  • ఆరోగ్యంగా ఉండేవారిలో 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్‌లెట్లు ఉంటాయి. డెంగీ ఫీవర్ వచ్చిన వారిలో ఈ ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. అలా తగ్గిన వారు వెంటనే ఆసుపత్రిలో జాయిన్ కావాలి.
  • డెంగీ జర్వానికి ప్రస్తుతానికి కచ్చితమైన మందులంటూ లేవు. జ్వరం తగ్గటానికి పారాసిట్మాల్, ఇన్‌ఫెక్షన్లు రాకుండా యాంటీబయోటిక్స్, ఎలక్ట్రోలైడ్స్‌, ఐవీ ప్లూయిడ్స్ అందిస్తారు.
  • ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కుండీలు, తాగేసిన కొబ్బరి బోండాలు, టైర్లు, ఉపయోగించని పాత్రలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *