Air India: ల్యాండింగ్ సమయంలో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో ఎయిర్‌పోర్టులో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం.. ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతుండగా.. బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్‌పోర్టు అధికారులు పైలట్‌ను అలర్ట్ చేశారు. అయితే ఆ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే అందులో ఉన్న ప్రయాణికులను హుటాహుటిన బయటికి రప్పించారు. అనంతరం ఆ విమానంలో గాలింపు చేపట్టారు. మరోవైపు.. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు మొత్తం పూర్తిస్థాయి ఎమర్జెన్సీ విధించారు. కేరళ రాజధాని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ముంబై నుంచి తిరువనంతపురం బయల్దేరిన ఎయిరిండియా విమానానికి గురువారం ఒక బాంబు బెదిరింపు వచ్చింది. 135 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఎయిరిండియా 657 విమానం.. ఉదయం 8 గంటలకు తిరువనంతపురం విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఈ బాంబు బెదిరింపుతో అలర్ట్ అయిన అధికారులు.. తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక బాంబు బెదిరింపు వచ్చిన విమానాన్ని ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్ బేకు తరలించి.. బాంబు స్క్వాడ్ సహా సెక్యూరిటీ ఏజెన్సీలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
ఉదయం 7.30 గంటలకు ఆ విమానం.. తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు చేరుకునే సమయంలో పైలట్‌కు బాంబు బెదిరింపు సమాచారం అందినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే అలర్ట్ అయి 7.36 గంటలకు ఎయిర్‌పోర్టులో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇక ఆ విమానాన్ని సేఫ్‌గా ల్యాండింగ్ చేసి ఐసోలేషన్ బేకు తరలించిన అనంతరం అందులో ఉన్న 135 మంది ప్రయాణికులను ఉదయం 8.44 గంటలకల్లా సురక్షితంగా విమానం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ బాంబు బెదిరింపు ఘటనలో ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తిరువనంతపురం ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇక విమానం నుంచి ప్రయాణికులు దిగిన తర్వాత అందులో తనిఖీలు చేపట్టడంతో వారి లగేజీ అందులోనే ఉండిపోయింది. దీంతో గంటల తరబడి ప్రయాణికులు తమ లగేజీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఘటన కారణంగా ఎయిర్‌పోర్టు కార్యకలాపాల్లో ప్రస్తుతం ఎలాంటి అంతరాయం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. అసలు ఆ బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది.. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.