హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి గడిచిన పదేళ్లకాలంలో అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు మొత్తం 695 చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా.. ఇందులో 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై కనుమరుగయ్యాయి. మరో 127 చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణల పాలైంది. మొత్తంగా ఆయా చెరువులన్నింట్లో కలిపి గత పదేళ్లలో 386.71 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. వీటిలో శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలు వెలిశాయి.
రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులతోపాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) వద్ద తీసుకున్న శాటిలైట్ చిత్రాల ద్వారా చెరువుల స్థితిని అధికారులు పరిశీలించారు. ఆక్షాంశం, రేఖాంశం ఆధారంగా ఒక్కో చెరువు 2014 వరకు ఎంత విస్తీర్ణంలో ఉంది, ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో ఉందనేది అంచనా వేశారు. తద్వారా ఆక్రమణల లెక్క తేల్చారు. అభివృద్ధి విస్తరణ క్రమంలోనే ఈ ఆక్రమణలు జరుగుతూ.. చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవానికి ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఆక్రమణల తంతు మొదలైనా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత కూడా ఇది ఆగలేదు. పైగా, అంతకన్నా ఎన్నో రెట్లు పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు అంగుళం ఆక్రమణకు కూడా గురికాని 77 చెరువుల్లో.. 20 చెరువులు గత పదేళ్లలో పూర్తిగా కనుమరుగు కావడమే ఇందుకు నిదర్శనం. మరో 57 చెరువులు పాక్షికంగా కబ్జా చెరలో చిక్కాయి. వీటికితోడు.. గతంలో కొంత విస్తీర్ణం మేరకు ఆక్రమణకు గురైన 94 చెరువుల్లో 24 చెరువులు ఈ పదేళ్లలో పూర్తిగా కనుమరుగయ్యాయి. మరో 70 చెరువుల్లో ఆక్రమణలు పెరిగిపోయాయి.