సల్మాన్ ఇంటిపై దాడికి ముందు.. షూటర్లకు గ్యాంగ్‌స్టర్ 9 నిమిషాలు మోటివేషన్ స్పీచ్!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటనపై పోలీసులు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సల్మాన్‌ హత్యకు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కుట్ర పన్నినట్టు ముంబయి క్రైమ్ బ్రాంచ్ గుర్తించింది. ఈ ఘటనపై పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌‌షీట్‌లో కీలక అంశాలు బయబకు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్‌మోల్ బిష్ణోయ్.. కాల్పుల జరపడానికి ముందు షూటర్లకు మోటివేషన్ స్పీచ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. నిందితులు విక్కీ గుప్తా, సాగర్ పాల్‌ ఇద్దరికీ అతడు 9 నిమిషాల పాటు హితబోధ చేసినట్టు తెలిపారు. సల్మాన్ ఇంటిపై దాడిచేస్తే.. మీరు చరిత్రలో నిలిచిపోతారని వారికి బ్రెయిన్ వాష్ చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

‘సల్మాన్ ఖాన్ భయపడేలా కాల్పులు ఉండాలి.. హెల్మెట్లు తీసి, సిగరెట్లు తాగుతూనే ఉండండి.. అప్పుడే మీ ముఖంలో భయమే లేనట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవుతుంది’ అని అన్‌మోల్ చెప్పినట్టు పేర్కొన్న పోలీసులు.. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌లను ప్రస్తావించారు. ఏప్రిల్ 14న బాంద్రాలోని సల్మాన్ ఖాన్ నివాసం వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ‘ఈ పని మీరు సక్రమంగా చేయండి…అనుకున్నట్టు పని పూర్తిచేస్తే మీరు చరిత్రను సృష్టిస్తారు.. ఇది మతపరమైన బాధ్యత.. ఈ పని చేస్తున్నప్పుడు అస్సలు భయపడకండి. ఈ పని చేయడం వల్ల సమాజంలో మార్పు వస్తుంది.. మనం ఏదైనా పని చేయడానికి వెళ్ళినప్పుడల్లా తుపాకీలో తూటాలను ఖాళీ చేసేరావాలి.. మీరు సల్మాన్ ఖాన్ ఇంటి బయటికి రాగానే ఖాళీ చేయండి’ అని వాళ్లను ప్రోత్సహించాడు.

కాల్పుల ఘటనకు ముందు నిందితులు గుప్తా, పాల్‌తో అన్‌మోల్ తరుచూ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన సోనూకుమార్ బిష్ణోయ్, మహ్మద్ రఫీక్ చౌధరి, హర్పాల్ సింగ్‌లు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. లారెన్స్ బిష్ణోయ్, అన్‌మోల్, రాతరన్ బిష్ణోయ్‌లను మోస్ట్ వాండెట్‌గా పేర్కొన్నారు. అన్‌మోల్ ప్రస్తుతం కెనడాలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు.

మరోవైపు, సల్మాన్ ఖాన్ పోలీసుల ముందు ఇచ్చిన వాంగ్మూలం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాల్పులు జరిగిన రోజు తాను ఇంట్లోనే ఉన్నానని తెలిపారు. బుల్లెట్ల శబ్దంతోనే తాను నిద్ర లేచానని సల్మాన్‌ అందులో పేర్కొన్నారు. తెల్లవారుజామున 4.55 గంటలకు ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి, మొదటి అంతస్తు బాల్కనీపై కాల్పులు జరిపిన విషయాన్ని బాడీగార్డ్‌ వచ్చి తనకు చెప్పినట్లు ఆయన వివరించారు. తనతోపాటు తన కుటుంబంపైనా గతంలోనూ దాడి ప్రయత్నాలు జరిగాయని సల్మాన్ వివరించారు.

ఈ ఘటనపై బాంద్రా పోలీస్‌ స్టేషన్‌లో తన సెక్యూరిటీ గార్డ్‌ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ దాడికి బాధ్యులుగా పేర్కొంటూ గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌, అతడి సోదరుడు అన్‌మోల్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన విషయాన్ని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *