ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ (Mpox) వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న ఈ వైరస్ మిగతా ఖండాల్లోని దేశాలకు పాకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ అధ్యక్షతన ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించి.. సమీక్షచేపట్టారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేశారు. తాజాగా, మంకీపాక్స్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు చేసింది. వీటితో పాటు బంగ్లాదేశ్, పాకిస్థాన్ సరిహద్దుల్లోని పోర్టుల దగ్గర కూడా నిఘా పెంచాలని సూచించింది.
మంకీపాక్స్ అనుమానిత లక్షణాలున్నవారు కనిపిస్తే వెంటనే తెలపాలని పేర్కొంది. అటు, మంకీపాక్స్ బాధితుల ఐసోలేషన్, చికిత్సల కోసం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా, సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింగ్ ఆసుపత్రులను ఆరోగ్య మంత్రిత్వశాఖ ఎంపికచేసింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్ ఎదుర్కొడానకి సిద్ధంగా ఉండాలని, నోడల్ కేంద్రాలుగా తమ పరిధిలోని కొన్ని ఆసుపత్రులను గుర్తించాలని తెలిపింది. వైరస్ నిర్ధారణ కోసం టెస్టింగ్ ల్యాబ్స్‌ని సిద్ధం చేయాలని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 ల్యాబ్‌లు సిద్దంగా ఉన్నాయన్న కేంద్రం.. ఎంపాక్స్‌ను అడ్డుకోవడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరింది. మంకీపాక్స్ వైరస్ లక్షణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించింది.
ఇక, మంకీపాక్స్ సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమీక్ష సందర్భంగా దేశంలో ఇప్పటివరకు మంకీపాక్స్ కేసు ఒక్కటీ నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. కేసు నమోదైనా.. భారీస్థాయిలో వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని తెలిపారు. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఈ వైరస్ వ్యాప్తిపై ఆందోళనకు గురవుతోంది. ఆఫ్రికా దేశాలను చుట్టేయడంతో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన డబ్యూహెచ్‌వో.. అన్ని దేశాలను అప్రమత్తం చేసింది.