గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత 2-3 నెలల వ్యవధిలో వందలాది ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాగా, ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. పేదల ఇండ్లను మాత్రమే నేలమట్టం చేస్తున్నారని.. పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేయటం సరైంది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని.. అసలు అది చెరువుల బఫర్, ఎఫ్‌టీఎల్ జోన్ అనేది తెలియకుండానే పేదల బిల్డర్ల వద్ద నుంచి ఆ ఇండ్లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. బిల్డర్ల మోసానికి బలేపోయే పేదలను ఆదుకోవాలని హైడ్రా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇండ్లు కోల్పోయిన పేదలకు బిల్డర్ల నుంచి పరిహారం ఇప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వివరించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో చర్చించాలని భట్టి సూచించినట్లు సమాచారం. ఈ మేరకు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై త్వరలో రేవంత్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నష్టపోయిన పేదలకు బిల్డర్ల నుంచే పరిహారం అందించే విధంగా త్వరలోనే విధానపర నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.