ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్.. వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు, పతకం లేకుండానే!

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ షాక్ తగిలింది. సెమీ ఫైనల్‌లో గెలిచి నాలుగో పతకం ఖాయం చేసిన వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. దీంతో పతకం ఖాయమనుకున్న భారత్‌కు షాక్ తగిలింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు బరువు కొలవగా.. 50 కేజీల కంటే సుమారు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి.

వాస్తవానికి మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల ఫైనల్‌ బుధారం రాత్రి జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా ఆమె బరువును చూసిన నిర్వహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై భారత ఒలింపిక్ సంఘం సైతం స్పందించింది.

“వినేష్ ఫొగాట్‌ 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో అనర్హత వేటును ఎదుర్కవాల్సి వచ్చింది. ఉండాల్సిన బరువు కన్నా కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది. దయచేసి ఆమె (వినేష్ ఫొగాట్) ప్రైవసీకి భంగం కలగకుండా ఉండాలని అందర్నీ కోరుతున్నాం. ఈ తరహా వార్తను (అనర్హత వేటు) పంచుకునే పరిస్థితి రావడం అత్యంత బాధాకరం” అని భారత ఒలింపిక్ సంఘం ప్రకటన విడుదల చేసింది.

కాగా తన కెరీర్‌లో మూడో ఒలింపిక్‌లో పాల్గొన్న వినేష్ ఫొగాట్.. ఈ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన తొలి మహిళా రెజ్లర‌గా నిలిచింది. 2016 రియో ఒలింపిక్స్‌లో గాయం కారణంగా ఆమె పోటీ నుంచి నిష్క్రమించింది. ఇక 2020 టోక్యో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఓడిపోయింది. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌‌లో వరుస విజయాలతో ఫైనల్ చేరింది. రౌండ్‌-16లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జపాన్‌కు చెందిన యుయిని 3-2తో వినేష్‌ ఫొగాట్‌ చిత్తు చేసింది. దీంతో క్వార్టర్స్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లోనూ ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌ను 7-5తో ఓడించింది. సెమీఫైనల్‌ అయితే ఏకంగా 5-0 తేడాతో క్యూబాకు చెందిన రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్‌ను చిత్తు చేసింది.

దీంతో ఈసారి ఆమె స్వర్ణ పతకం సాధిస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కొన్ని గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో నిష్క్రమించింది.

About rednews

Check Also

భారత్ 46 ఆలౌట్.. సొంత గడ్డపై అత్యల్ప స్కోరు.. కివీస్ పేసర్ల ధాటికి విలవిల్లాడిన బ్యాటర్లు..!

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కుప్పకూలింది. పేకమేడను తలపిస్తూ.. భారత బ్యాటర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *