బాలికల కనీస వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గింపు.. పార్లమెంట్‌ ముందుకు బిల్లు

అమ్మాయిలకు కనీస వివాహ వయసును 9 ఏళ్లకు కుదిస్తూ ఇరాక్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత బిల్లుపై తీవ్ర ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉన్న కనీస వివాహ వయసు వ్యక్తిగత చట్టంలో సవరణలను చేసిన ఈ వివాదాస్పద బిల్లును ఇరాక్ న్యాయశాఖ మంత్రి పార్లమెంట్‌ ముందుంచారు. ఈ బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే కుటుంబ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునేందుకు, మతపరమైన అధికారులు లేదా సివిల్ న్యాయవ్యవస్థలో దేనినైనా ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. అయితే, వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ విషయాలలో హక్కులను ఇది హరిస్తుందని విమర్శకులు భయపడుతున్నారు.

ఈ బిల్లు ఆమోదం పొందితే 9 ఏళ్ల వయసు బాలికలు.. 15 ఏళ్లలోపు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతి లభిస్తుంది. దీంతో బాల్య వివాహాలు, లైంగిక దోపిడీలు పెరుగుతాయనే భయాల వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యలు మహిళల హక్కులు, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాల పురోగతిని అణగదొక్కుతుందని హక్కుల సంఘాలు ఆందోళనకు గురవుతున్నాయి. మానవహక్కుల సంస్థలు, మహిళా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే బాలిక విద్య, ఆరోగ్యం, సంక్షేమంపై తీవ్రమైన ప్రతికూలతకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. బాల్య వివాహాల వల్ల డ్రాపౌట్ల రేటు, చిన్న వయసులో గర్బం దాల్చడం, గృహహింస ముప్పు పెరుగుతుందని వాదిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి చిన్నారుల సంరక్షణ సంస్థ యునిసెఫ్ నివేదిక ప్రకారం.. ఇరాన్‌లోని 28 శాతం మంది బాలికలకు 18 ఏళ్లలోపే వివాహాలు జరిగిపోతున్నాయి. ‘ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే దేశం వెనక్కి వెళ్లిపోతుంది’ అని మానవహక్కుల అధ్యయనకర్త సారా సనాబర్ అన్నారు. ‘ఇప్పటికే సంప్రదాయవాద సమాజంలో ఈ సవరణ కుటుంబంలో పురుషుల ఆధిపత్యానికి భారీ వెసులుబాటును అందిస్తుంది’ అని ఇరాక్ మహిళల హక్కుల సంస్థ చీఫ్ అమల్ కబాషీ మండిపడ్డారు.

వాస్తవానికి జులైలోనే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు రాగా.. చాలా మంది ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఆగస్టు 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకాగా.. శక్తివంతమైన షియా వర్గం ఎంపీల మద్దతు ఇవ్వడంతో మళ్లీ సవరణ బిల్లును తీసుకొస్తోంది.ఇరాక్‌లో రాచరికం అంతమైన తర్వాత అధికారాన్ని మతపరమైన వ్యక్తుల నుంచి న్యాయవ్యవస్థకు బదిలీ చేసేలా 1959లో తీసుకొచ్చిన చట్టంలో మార్పులు చేయనున్నారు. కొత్త బిల్లు ప్రధానంగా షియా, సున్నీల మతపరమైన నిబంధనలను తిరిగి అమల్లోకి తీసుకురానుంది. కానీ, అటంకాలను దాటుకుంటూ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తోన్న దేశంలోని మహిళల పరిస్థితి మరింత దిగజార్చుతుందని ఆధునికవాదులు మండిపడుతున్నారు.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *