Toll Tax: మహారాష్ట్రలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వివిధ వర్గాలకు ఊరటనిచ్చేలా అనేక పథకాలు, నిర్ణయాలను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాహనదారులకు మహారాష్ట్ర సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ఇక నుంచి ముంబై నగరంలోకి ప్రవేశించే.. లైట్ మోటార్ వాహనాలకు ఆ మార్గంలో ఉండే టోల్ ప్లాజాల్లో టోల్ ఫీజులు వసూలు చేయమని తేల్చి చెప్పింది. కార్లు, ఎస్యూవీలకు.. సోమవారం అర్ధరాత్రి నుంచే టోల్ ఫీజులు వసూలు చేయమని స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో సోమవారం జరిగిన మహారాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. థానే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఏక్నాథ్ షిండే.. గతంలో అనేక సార్లు టోల్ వసూళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే.. తాజాగా టోల్ ఛార్జీలు వసూలు చేయడాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏక్నాథ్ షిండే సర్కార్కు ఇదే చివరి కేబినెట్ భేటీ కావడంతో.. టోల్ ఛార్జీల రద్దుతోపాటు మరిన్ని నిర్ణయాలు తీసుకున్నారు.