వర్షాకాలం రావటంతో.. రైతులంతా ప్రభుత్వంవైపు ఆశగా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం నగదు సాయం ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 13న) జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లో మాట్లాడిన మంత్రి తుమ్మల.. రైతు భరోసా డబ్బులు విడుదలపై కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా డబ్బులు.. ఈసారి పంట వేసి సాగు చేస్తున్న వారికే ఇస్తామని తుమ్మల స్పష్టం చేశారు. కొండలు, గుట్టలకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వబోమని క్లారిటీ ఇచ్చారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంది అనర్హులకు కూడా రైతుబంధు సాయం అందించి.. పథకాన్ని నీరుగార్చిందని తుమ్మల విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయబోదని.. రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. పంట వేసి.. సాగు చేస్తున్న రైతుల అకౌంట్లలోని మాత్రమే రైతు భరోసా సాయం డబ్బులు పడతాయని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. రుణమాఫీపై కూడా మంత్రి తుమ్మల ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇప్పటికీ రుణమాఫీ కాని రైతులకు సెప్టెంబర్ చివరిలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని.. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతులు.. ఎక్కువగా ఉన్న మొత్తాన్ని బ్యాంకు చెల్లించాలని మంత్రి కోరారు. ఆ తర్వాత.. మిగిలిన 2 లక్షలను తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుందని మంత్రి తుమ్మల వివరించారు.