హైదరాబాద్‌ను వణికిస్తోన్న నొరో వైరస్.. వేగంగా పెరుగుతున్న కేసులు.. 

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోకముందే ప్రజలను మరో కొత్త వైరస్ భయపెడుతోంది. అత్యంత వేగంగా వ్యాపించే నొరో వైరస్.. ఇప్పుడు హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వటమే కాకుండా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ కారణంగా.. కేవలం పాతబస్తీ ప్రాంతంలోనే రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) వెల్లడించింది. ఈ నొరో వైరస్ విషయంలో ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. నొరో వైరస్‌తో జాగ్రత్తగా ఉండాలంటూ ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీ పలు సూచనలు చేసింది.

అసలే వార్షాకాలం కావటం.. ఎడతెరపి లేకుండా కురిసే వర్షాలతో పరిసరాలన్ని దుర్గంధంగా మారటంతో.. రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలోనే.. పలు కొత్త వైరస్‌లు పుట్టుకొస్తుండగా.. ఇప్పుడు ఈ నొరో వైరస్ అందరినీ భయపెడుతోంది. నొరో వైరస్ సోకడానికి.. కలుషిత నీరే ప్రధాన కారణంగా చెప్తున్నారు. కలుషిత నీటితో పాటు నాణ్యతలేని ఆహారం కూడా ఈ వ్యాధికి కారకంగా వైద్యులు చెప్తున్నారు. ఈ వైరస్ సోకినవారికి.. చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు ఉంటాయని జీహెచ్ఎంసీ చెప్తోంది. ఇదొక రకమైన అంటువ్యాధి కావటంతో.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

నొరో వైరస్ సోకిన వారిలో కనిపించే లక్షణాలు..

నొరో వైరస్ సోకిన వారికి వాంతులు, విరేచనాలతో పాటు శరీరం డీహైడ్రేషన్ అవుతుంటుంది. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల.. మధ్య వయస్కులు, వృద్ధులు, గర్భిణులు, కౌమారదశలో ఉన్న బాలికల్లో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌ను కలిగిస్తోందని వైద్యులు చెప్తున్నారు. శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవ్వడంతో.. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువుగా ఈ వైరస్ బారినపడే అవకాశాలున్నాయి.
ఇది ఒక అంటువ్యాధి కావటంతో ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపించే అవకాశం ఉంది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నవారికి లేదా కలుషితమైన పరిసరాల్లో ఉన్న వారికి ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. అయితే.. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది రెండు, మూడు రోజుల్లోనే కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. నొరో వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైద్యులు సూచించిన మాత్రలు వాడటంతో పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా రెండు నుంచి మూడు రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవచ్చు.

నొరో వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అయితే.. నొరో వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కావటంతో.. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. వేడి నీళ్లను తాగటం మంచిది. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వేడి వేడి ఆహారాన్ని, శుభ్రమైన ఆహార పదర్థాలను తీసుకోవాలి. వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను వేడి నీటితో శుభ్రం చేయాలి. వైరస్ సోకిన వ్యక్తికి తగ్గేవరకు దూరంగా ఉండాలి.

About rednews

Check Also

హైదరాబాద్‌లో భారీగా కుంగిన రోడ్డు.. పెద్ద ప్రమాదమే తప్పింది.. 200 మీటర్ల దూరంలోనే..!

హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రోడ్డు భారీగా కుంగిపోయింది. మంగళవారం (అక్టోబర్ 22న) రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *