Easing Mideast Tensions: కొద్దిరోజుల కిందట అంతర్జాతీయంగా అనిశ్చిత సంకేతాలు, ముఖ్యంగా రష్యా- ఉక్రెయిన్, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం, అమెరికా చైనా ట్రేడ్ వార్, బంగ్లాదేశ్‌లో సంక్షోభం.. ఇలా ఎన్నో కారణాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపాయి. ఈ కారణంతోనే కొన్నాళ్లు బంగారం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటం.. ఇంధన ధరలు పెరగడం వంటివి జరిగాయి. అయితే ఇప్పుడు కొన్ని కారణాలతో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు పతనం అవుతున్నాయి. మంగళవారం రోజు కూడా పడిపోగా.. ఇప్పుడు 2 వారాల కనిష్ట స్థాయికి చమురు రేట్లు దిగొచ్చాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో (మిడిల్ ఈస్ట్) ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు సంకేతాలు అందడం ప్రధాన కారణం. గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై పరిష్కారం దిశగా చర్చల ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అంగీకరించడం బలం చేకూర్చింది.
దీనికి తోడు చైనాలో ఆర్థిక వ్యవస్థ బలహీనత కూడా ఆ దేశంలో ఫ్యూయెల్ డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది. భారత్‌తో సహా చైనా అనేది ప్రపంచంలోనే క్రూడాయిల్ వినియోగంలో ముందువరుసలో ఉంటుందని చెప్పొచ్చు. అందుకే ఈ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఇంధన రేట్లు పడిపోతున్నాయని చెప్పొచ్చు.
అక్టోబర్ బ్రెంట్ ఫ్యూచర్స్ 27 సెంట్లు పడిపోయి ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు 77.39 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) సెప్టెంబర్ క్రూడ్ 21 సెంట్లు తగ్గి 74.16 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డబ్ల్యూటీఐ ఫ్యూచర్స్ కూడా అక్టోబర్ సమయానికి సంబంధించి 27 సెంట్ల పతనంతో బ్యారెల్‌కు 73.39 డాలర్ల వద్ద ఉంది.
ఇరాన్- ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ డీల్ జరిగితే గనుక ఈ చమురు ధరలు ఇవాళ మరింత పడిపోవచ్చని తెలుస్తోంది. ఈ మేరకు నిపుణులు చెబుతున్నారు. ధరలు తగ్గుతున్న నేపథ్యంలో యూఎస్ క్రూడ్ స్టాక్స్ కూడా గత 8 వారాలుగా పడుతూనే ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్న క్రమంలోనే ఇటీవల భారత ప్రభుత్వం.. విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించింది.
దేశీయంగా చమురును వెలికితీసి.. పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ రూపంలో విదేశాలకు ఎగుమతి చేసే దేశీయ ఆయిల్ కంపెనీలపై కేంద్రం.. విండ్‌ఫాల్ టాక్స్ వసూలు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది గతంలో టన్నుకు రూ. 4600 గా ఉండగా.. దాదాపు సగానికిపైగా తగ్గించి రూ. 2100 కి చేర్చింది. రేట్లు పడిపోతే దీనిని ఇంకా తగ్గించే అవకాశాలు ఉంటాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు పడిపోతున్న క్రమంలో.. ఇలాగే కొనసాగితే దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం సవరించే అవకాశాలు ఉంటాయి. దాదాపు రెండు సంవత్సరాలుగా రేట్లు ఇక్కడ స్థిరంగా ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలోనే లీటర్ మీద రూ. 2 చొప్పున తగ్గించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ రూ. 107.41 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ. 95.65 వద్ద ఉంది.