తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం స్థానికులను కలవరపెడుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత కనిపించి 9 రోజులు దాటింది. అయితే ఇప్పటికీ దానిని అటవీశాఖ బంధించలేకపోతోంది. దీంతో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. అయితే శుక్రవారం చిరుత ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. శివారు ప్రాంతాలైన దివాన్ చెరువు, లాలా చెరువు, స్వరూప్ నగర్, తారక నగర్, శ్రీరాంపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేశారు.
అయితే 9 రోజుల సమయంలో చిరుత కేవలం నాలుగుసార్లు మాత్రమే కెమెరాలకు చిక్కినట్లు అధికారులు చెప్తున్నారు. శుక్రవారం మరోసారి కనిపించిందని చెప్తున్నారు. చిరుత కదలికలను అనుసరించి.. ట్రాప్ కెమెరాలు, బోన్లను మారుస్తున్నట్లు వివరిస్తున్నారు. డ్రోన్ సాయంతో చిరుత కదలికలు కనిపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ అది విఫలమైంది. ఈ నేపథ్యంలో థర్మల్ డ్రోన్ రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ థర్మల్ డ్రోన్ల సాయంతో రాత్రిపూట సైతం గాలింపు చర్యలు చేపట్టవచ్చు. ఇక శుక్రవారం చిరుత ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో.. అటవీ శాఖ అధికారులు స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. ఆటోనగర్ నుంచి లాలా చెరువు హౌసింగ్ బోర్డు వరకు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సాధారణంగా చిరుతలు జనావాసాల్లోకి రావని చెప్తున్న అటవీశాఖ అధికారులు.. ఏవైనా శబ్దం వినిపిస్తే దూరంగా వెళ్లిపోతాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. అలాగే ఆహారం, నీరు వంటివి దొరకని పరిస్థితుల్లోనే జనావాసాల్లోకి వస్తాయంటున్నారు. అయితే ఇప్పటి వరకూ నివాస ప్రాంతాల్లో చిరుత తిరుగుతున్నట్లు ఇప్పటి వరకూ గుర్తించలేదన్న అధికారులు.. ఏదేమైనా జాగ్రత్తగా, అప్రమత్తతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇక చిరుత సంచారంపై వచ్చే ప్రచారాలు, వదంతులు నమ్మవద్దని.. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో చిరుత సంచారంపై వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.