తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడిన ‘దానా’ తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాను పరదీప్‌కు దక్షిణ తూర్పు దిశలో 330 కిలోమీటర్లు, ధమ్రాకు 360 కి.మీ., సాగర ద్వీపానికి (పశ్చిమబెంగాల్) 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుఫాను ఉత్తర, పశ్చిమ దిశగా తీరానికి చేరువవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతోవాయువ్య దిశగా దూసుకొస్తున్న ఈ తుఫాను.. పశ్చిమ్ బెంగాల్-ఒడిశా మధ్య పూరీ-సాగర్ ఐల్యాండ్‌కు సమీపంలోని భితార్కనిక-ధమ్రా వద్ద గురువారం రాత్రి (అక్టోబరు 24) లేదా శుక్రవారం తెల్లవారుజామున (అక్టోబరు 25) తీరం దాటుతుందని అంచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో 20 సెం.మీ.పైగా వర్షపాతం నమోదువుతుందని పేర్కొంది.
ఒడిశాలోని జగత్సింగ్పూర్, కేంద్రపడ, కటక్, భద్రక్, జాజ్‌పూర్, బాలేశ్వర్, మయూర్భంజ్ జిల్లాల్లో రెండు రోజులు (గురు, శుక్రవారాలు) పాటు రెడ్ అలర్ట్ జారీచేయగా.. 20 సెంటీమీటర్లకుపైగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పూరీ, ఖుర్దా, కేంఝర్, నయాగఢ్, ఢెంకనాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గంజాం, బౌద్ధ్, అనుగుల్, దేవ్‌గఢ్, సుందర్‌గఢ్, కొంధమాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు, పశ్చిమ్ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, తూర్పు, పశ్చిమ మేదినీపూర్, ఝార్గ్రామ్, హౌరా, హుగ్లీ, కోల్‌కతా, బంకుర జిల్లాలోని కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు, చాలా చోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది.
తుఫాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన రైల్వే.. రెండు రోజుల పాటు తూర్పు, తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని 150కిపై రైళ్లను రెండు రోజుల పాటు రద్దుచేసింది. కోల్‌కతా, భువనేశ్వర్ విమానశ్రయాలను గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకూ మూసివేయనున్నారు. కోల్‌కతా విమానాశ్రయంలో గురువారం సాయంత్రం 6 గంటల నుంచి విమానాల రాకపోకలు 15 గంటల పాటు నిలివేయాలని నిర్ణయించారు. ప్రయాణికులు, ఉద్యోగుల భద్రత, మౌలిక వసతులు భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు.