అంబానీకి ఊహించని షాక్.. 5 ఏళ్ల నిషేధం.. రూ.25 కోట్ల జరిమానా..!

Anil Ambani: ప్రముఖ వ్యాపారవేత్త, ముకేశ్ అంబానీ సోదరుడు అనీల్ అంబానీకి ఊహించని షాక్ ఇచ్చింది మార్కెట్ల నియంత్రణా సంస్థ సెబీ (SEBI). సెక్యూరిటీల మార్కెట్ల నుంచి ఆయనను 5 ఏళ్ల పాటు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులు, మరో 25 సంస్థల పైనా ఈ నిషేధం ఉంటుందని సెబీ శుక్రవారం వెల్లడించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలో నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలోనే అనీల్ అంబానీ, మాజీ అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అలాగే అంబానీపై రూ. 25 కోట్ల జరిమానా సైతం విధించినట్లు తెలిపింది.

సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉండే ఏ కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని అంబానీపై ఆంక్షలు విధించింది. అలాగే నమోదిత కంపెనీలు, సెబీ రిజిస్టర్డ్ మధ్యవర్తిత్వ సంస్థల్లోనూ డెైరెక్టర్ సహా ఏ కీలక పదవీ తీసుకోకూడదని ఆదేశించింది. అలాగే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థను కూడా సెక్యూరిటీ మార్కెట్ల నుంచి 6 సంవత్సరాల పాటు నిషేధిస్తున్నట్లు సెబీ తెలిపింది. కంపెనీకి సైతం రూ. 6 లక్షల జరిమానా విధించింది. తమ అనుబంధ సంస్థలకు లోన్ల రూపంలో రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నిధులను అనీల్ అంబానీ మళ్లించారని సెబీ తమ నివేదికలో పేర్కొంది. నిధుల మళ్లింపు కోసం కంపెనీలోని ఉన్నతాధికారులతో కలిసి ఆయన కుట్ర చేశారని ఆరోపించింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ యాజమాన్యం పెడచెవిన పెట్టిందని పేర్కొంది. అనీల్ అంబానీ ఒత్తిడి తోనే ఉన్నతాధికారులు కావాలనే నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది.

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ నుంచి నిధుల మళ్లింపులో మధ్యవర్తిగా ఇతర సంస్థలు వ్యవహరించాలని సెబీ ఆరోపించింది. ఇలా RFHL నుంచి లోన్లు తీసుకున్న కంపెనీలు తిరిగి చెల్లించలేదని, దీని ఫలితంగానే ఆ కంపెనీ దివాలా తీసినట్లు పేర్కొంది సెబీ. దివాలా తీయడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పరిష్కార ప్రణాళికకు వెళ్లాల్సి వచ్చినట్లు తెలిపింది. దీంతో అందులో షేర్లు కొన్నవారికి భారీ నష్టాలు వచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. 2020 నాటికి కంపెనీ మోసం బయటపడడంతో షేరు విలువ 0.75 శాతానికి పడిపోయిందని గుర్తు చేసింది. ఇప్పటికీ 9 లక్షల మంది నష్టాల్లో కొనసాగుతున్నారని గుర్తు చేసింది. గతంలో 2022లోనూ సెబీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అనీల్ అంబానీ, ఉన్నతాధికారులు, ఇతర సంస్థలపై నిషేధం విధించడం గమనార్హం.

About rednews

Check Also

Dana Cyclone: ఏపీపై దానా తుఫాన్‌పై ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుఫాన్‌గా బలపడి హబాలిఖాతి నేచర్ క్యాంప్‌ (భిత్తర్కనిక)-ధమ్రాకు సమీపంలో తీరం దాటినట్లు ఏపీ విపత్తుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *