అన్నాచెళ్లలు, అక్కాతమ్ముళ్లు ఎంతగానే ఎదురుచూస్తున్న రాఖీ పౌర్ణమి వచ్చేసింది. ఏడాదికి ఒక్కసారి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకకగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. అలాంటి పండగ పూట ఓ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆకతాయి వేధింపులకు ఓ బలైపోయింది. చివరిసారిగా తన తమ్ముడికి రాఖీ కట్టి తనువు చాలించింది. గుండెల్ని పిండేసే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలంలోని ఓ తండాలో చోటు చేసుకుంది.
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓ తండా కు చెందిన మైనర్ బాలిక కోదాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో పాల్‌టెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే గత కొంత కాలంగా ఓ యువకుడు బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రేమిస్తున్నాంటూ ఆమె వెంటపడుతున్నాడు. ఆకతాయి వేధింపులను ఆ బాలిక తట్టుకోలేకపోయింది. చనిపోవాలని నిర్ణయించుకుంది. రెండ్రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన బందువులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రెండ్రోజులుగా బాలికకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. అయితే తాను చనిపోతానని తెలిసిన బాలిక చివరి సారిగా తన తమ్ముడికి రాఖీ కట్టాలనుకుంది. ఆసుపత్రికే తమ్ముడిని పిలిపుంచుకొని ఇవాళ ఉదయం రాఖీ కట్టింది. తమ్ముడి నుదిటిపై ముద్దు పెట్టి తన ప్రేమను చాటుకుంది. అమ్మానాన్నలను బాగా చూసుకోవాలని తమ్ముడి వద్ద మాట తీసుకుంది. అనంతరం కాసేపటికే కన్నుమూసింది. ఇలా తాను చనిపోతానని తెలిసి తమ్ముడికి చివరిసారిగా రాఖీ కట్టడం అందరినీ కలిచి వేసింది. బాలిక మృతితో ఆమె కుటుంబంలో విషాదం అలుముకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నర్సింహులపేట పోలీసులు ఆకతాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్కాతమ్ముళ్లను ఏకం చేసిన పోలీసులు..
ఇక మరో ఘటనలో ఇంటిస్థలం విషయమై అక్కాతమ్ముళ్ల మధ్య తలెత్తిన వివాదానికి పోలీసులు ప్రేమపూర్వక పరిష్కారం చూపించారు. రాఖీ పౌర్ణమి రోజున తమ్ముడికి అక్కతో రాఖీ కట్టించి ఇద్దరిని ఏకం చేశారు. వరంగల్ జిల్లా ఉర్సు కరీమాబాద్ కోయవాడకు చెందిన కోటమ్మ, ఆమె తమ్ముడు ఏడుకొండలు మధ్య గత కొంత కాలంగా వారసత్వ ఇంటి స్థలం కోసం గొడవ జరుగుతోంది. చివరికి కోటమ్మ.. తమ్ముడిపై మిల్స్ కాలనీ పీఎస్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిద్దరికీ సర్ది చెప్పి ఏకం చేశారు.