AP: ఆంజనేయస్వామి గుడి కూల్చివేతలో ట్విస్ట్.. పూజారి పనే

ఆంధ్రప్రదేశ్‌లో ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేసిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ దారుణం వెనుక పూజారి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పూజారి హరినాథ్ మరో ఐదుగురితో కలిసి పేలుడు పదార్థాలతో గుడిని పేల్చివేసేందుకు కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం కదిరినాథుని కోట సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని సోమవారం (అక్టోబర్ 14) రాత్రి ధ్వంసం చేశారు. పేలుడు పదార్థాలతో ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వర్షం కురవడంతో పేలుడు పదార్థాలు సరిగా పేలలేదు. ఆలయం ఒకవైపు ఒరిగిపోయింది. ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా పరిగణించారు. ముమ్మర దర్యాప్తు జరిపి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ముమ్మర దర్యాప్తు జరిపిన అన్నమయ్య జిల్లా పోలీసులు రెండు రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేయించాడని వెల్లడించారు. ఇందుకోసం కొంత మందితో కలిసి ప్రణాళిక రచించాడని తెలిపారు.

ఈ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు, ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

కదిరినాథుని కోటలో 16వ శతాబ్దంలో కనుగొండ రాయస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి ఎదురుగా బండపై అభయాంజనేయ స్వామి శిల్పాన్ని చెక్కారు. ఏడాది కిందట కొంత మంది దుండగులు ఈ అభయాంజనేయ స్వామి విగ్రహం కళ్లకు గంతలు కట్టి అక్కడ గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత అక్కడ ఆలయాన్ని నిర్మించి, అందులో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

అక్టోబర్ 14న అర్ధరాత్రి తర్వాత నిందితులు పేలుడు పదార్థాలు అమర్చి ఆలయాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. వర్షం కారణంగా రిగ్గులో నాట్లు సరిగా పేలలేదు. కొన్ని వైర్లు కాలిపోయాయి. అనంతరం సుత్తి, గడ్డపార ఇతర పరికరాలతో ఆలయం గోడ కింది భాగాన్ని తవ్వేశారు. దీంతో ఆలయం ఒక వైపు ఒరిగిపోయింది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *