దర్యాప్తు మొదలెట్టిన సిట్.. ప్రత్యేక వ్యూహంతో ముందుకు!

తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవిత్రమైన తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని.. ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందంటూ వచ్చిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను, శ్రీవారి భక్తులను కలవరపరిచాయి. ఈ అంశం మీద ఏపీలో చెలరేగిన రాజకీయ మంటలు సంగతి పక్కనబెడితే.. అందులో నిజానిజాలు వెలికితీసి, కారకులకు కఠినంగా శిక్షించాలని భక్తుల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ విచారణను ప్రారంభించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సిట్ సభ్యులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రత్యేక దర్యాప్తు బృందానికి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో మొత్తం 9 మంది సభ్యులుగా ఉన్నారు. వీరంతా శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకున్నారు. తిరుమల లడ్డూకు వినియోగించిన నెయ్యిపై ఈ దర్యాప్తు బృందం విచారణ చేయనుంది. తిరుపతిలో మూడు రోజుల పాటు బస చేసి.. దర్యాప్తు జరపనున్నారు. విచారణలో భాగంగా తిరుపతితో పాటుగా తిరుమలలోని వివిధ విభాగాలను సిట్ పరిశీలించనుంది. పరిశీలనలో తమ దృష్టికి వచ్చిన అంశాలపై నివేదిక తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు.

మరోవైపు దర్యాప్తు కోసం రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. డీఐజీ నేతృత్వంలో ఒక బృందం కల్తీ నెయ్యి పంపించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డెయిరీ యాజమాన్యాన్ని విచారణ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక తిరుపతి కేంద్రంగా ఐజీ నేతృత్వంలో కడప ఎస్పీ బృందం విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా టీటీడీ మార్కెటింగ్ విభాగంలో పరిశీలన జరపనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ పోటు, విక్రయ కేంద్రాలలో సిట్ బృందం పరిశీలన జరపనుంది. ఈ అంశాలను అన్నింటి మీద సమగ్ర దర్యాప్తు నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తారు. నివేదిక అందిన తర్వాత కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *