ఏపీ ప్రభుత్వానికి వరద సాయం కింద NRI భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

ఏపీలో వరద విపత్తు వేళ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు.. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు.. కొందరు విరాళాలు, మరికొందరు ఆహారం తెచ్చి వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ విరాళాలను ప్రకటించగా.. తాజాగా మరో ఎన్ఆర్ఐ, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఏపీకి భారీగా విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి విరాళాన్ని ప్రకటించారు.

ఏపీలో పరిస్థితులతో ప్రముఖ ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. ప్రభుత్వంబాధితులకు అందిస్తున్న సాయంలో.. ఆయన కూడా తనవంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి రూ.1 కోటి చెక్కును అందించారు. అలాగే వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధించాయని.. వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలుపంచుకునేందుకు విరాళం అందించానన్నారు శ్రీనివాస్. శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని.. గతంలోనూ కాణిపాకం దేవాలయాభివృద్ధికి రూ.18 కోట్లు అందజేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకుగాను శ్రీనివాస్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీనివాస్ గుత్తికొండ ఇంతకు ముందు హుద్ హుద్, తిత్లి తుఫానుల సమయంలో కూడా విరాళాలు అందించారు.

మరికొందరు కూడా ఏపీకి సాయం అందించారు. టాలీవుడ్ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సీ అశ్వినీదత్ ఏపీకి రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే ఆయ్ సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాసు కూడా వారం పాటూ తమ మూవీకి వచ్చే షేర్‌లో 25శాతం విరాళంగా ప్రకటించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీకి రూ.5 లక్షలు, తెలంగాణకు రూ.5లక్షలు సాయం పంపించారు. అలాగే వెంకయ్య కుమారుడు, కుమార్తెలు రెండు రాష్ట్రాలకు చెరో రూ.2.5 లక్షలు సాయంగా అందజేశారు. వీరితో పాటుగా పలువురు సామాన్యులు కూడా తమకు తోచిన సాయం అందిస్తున్నారు. విజయవాడకు చెందిన అక్కాచెల్లెళ్లు రూ.1.50 లక్షలు అందజేశారు. అలాగే జంబులయ్య మెమోరియల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ వర్ధంశెట్టి విద్యావతి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. లక్ష విరాళం అందించారు. చెక్కును నంద్యాల కలెక్టరేట్‌ చాంబర్‌లో కలెక్టర్‌ రాజకుమారికి అందజేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారని.. వరదబాధితుల సహాయార్థం తన వంతుగా సాయం అందించానన్నారు.

మరోవైపు విజయవాడ ముంపు ప్రాంతాల్లో మూడో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి 2 గంటల వరకూ విజయవాడ కలెక్టరేట్‌లోనే సీఎం చంద్రబాబు ఉన్నారు. సహాయ చర్యలు, వరద వంటి అంశాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన సోమవారం రాత్రి కూడా కలెక్టరేట్‌ వద్ద బస్సులోనే బస చేశారు. 2 గంటల తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ముఖ్యమంత్రి వెళ్లారు. మంత్రి నారా లోకేష్ కూడా అర్ధరాత్రి దాటే వరకూ కలెక్టరేట్‌లోనే ఉన్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. నేడు విజయవాడకు అదనపు బలగాలు, సహాయక బృందాలు వచ్చాయి. విజయవాడలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు.. బాధితులకు ఆహారం అందిస్తున్నారు.

About rednews

Check Also

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *